
23 నుంచి వైద్య రచయితల సమ్మేళనం
బళ్లారి రూరల్ : ఆగస్టు 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు బళ్లారి ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వైద్య రచయితల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు కన్నడ వైద్యరచయితల సమితి అధ్యక్షుడు డాక్టర్ గడ్డి దివాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఐఎంఏ హాలులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యుల్లోను రచయితలు, సాహితీవేత్తలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నడ వైద్య సాహిత్యంపై ముధోళ్ కుబసద ఆసుపత్రికి చెందిన డాక్టర్ శివానంద కుబసద ప్రసంగించనున్నారు. ఈ సమ్మేళనంలో వైద్యులైన రచయితలు, సాహితీవేత్తలు పాల్గొననున్నట్లు తెలిపారు. సమ్మేళనంలో సాహిత్యంపై చర్చాగోష్టిలో ప్రముఖులు ఉపన్యసించనున్నట్లు తెలిపారు. బసవరాజేశ్వరీ పాఠశాల సభాంగణంలో రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనంలో రాష్ట్రం నుంచి పలువురు వైద్యులు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యులైన రచయితలు పాల్గొననున్నట్లు తెలిపారు. పత్రికా సమావేశంలో బళ్లారి ఐఎంఏ ప్రముఖులు డాక్టర్ మాణిక్యరావు కులకర్ణి, డాక్టర్ పరసప్ప, డాక్టర్ అరవింద పాటిల్, డాక్టర్ సుమ గుడి తదితరులు పాల్గొన్నారు.