
కుండపోత వానలు.. నదుల పరవళ్లు
రాయచూరు రూరల్: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని బెళగావి, విజయపుర, బాగల్‌కోటె, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఎగువన ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా మంగళవారం నారాయణపుర డ్యాం నుంచి 2,08,860 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో దేవదుర్గ తాలూకాలోని కొప్పర రహదారి పూర్తిగా నీట మునిగింది. దేవదుర్గ తాలూకా హువిన హెడగి వంతెనపై వరద నీరు రావడంతో యాదగిరి, కలబుర్గి జిల్లాలకు రాకపోకలు స్తంభించాయి. చిక్కోడి తాలూకాలో 8 రోడ్డు వంతెనలు నీట మునగడంతో 18 గ్రామాలకు రాకపోకల సంబంధాలు తెగిపోయాయి. వరద పరిస్థితిపై ఆయా జిల్లాధికారులు అధికారులతో చర్చించారు. హువిన హెడగి వద్ద బసవేశ్వర ఆలయం నీట మునిగింది. కృష్ణా నదీ తీరంలో దేవసూగూరు, దొంగ రాంపూర్, ఆత్కూర్, బూడిదపాడు, నారదగడ్డ దత్తాత్రేయ ఆలయం వద్ద ప్రజల రక్షణకు ముందుండాలని అధికారులకు సూచించారు.
తుంగభద్రకు వరద పోటు
గత వారం రోజుల నుంచి టీబీడ్యాంకు ఎగువన మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ, దావణగెరె తదితర జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తుండడంతో తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. నదికి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర నీరు వదలడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఎదురైంది. దీంతో రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదీ తీరంలో మాన్వి తాలూకాలోని దాసరకట్ట, రాయచూరు తాలూకా ఎలెబిచ్చాలి వద్ద రాయల ఏక శిలా బృందావనం, జపం కట్ట, ఉగ్ర నరసింహ స్వామి, బిచ్చాలమ్మ దేవాలయం, నాగ దేవత కట్ట, శివలింగం జలావృత్తం అయ్యాయి. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ముంచెత్తుతున్న వర్షాలు
హొసపేటె: విజయనగర జిల్లాలో వర్షాల జోరు యథావిధిగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం హొసపేటె నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలో అనేక ప్రధాన రహదార్లు జలమయం అయ్యాయి. వర్షం నీరు రహదార్లలో నిలిచి జలమయంగా మారడంతో విద్యార్థులకు, వాహనదారులకు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక విజయనగర కాలేజీ రహదారిలో వర్షం నీరు ఏరులా పారింది. నగరంలోని ఆర్‌టీఓ కార్యాలయ ఆవరణ బురదమయంగా మారడంతో కార్యాలయానికి వాహన లైసెన్సులు చేయించుకోడానికి వచ్చే వారు ఈ బురదలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏడాది ఆర్‌టీసీ కార్యాలయానికి లక్షలాది మేర లాభాలు వస్తున్నా అధికారులు మాత్రం ఈ మట్టి రహదారిలో వర్షాకాలంలో కనీసం గరుసు మట్టి(గ్రావెల్) కూడా వేయించలేక పోతున్నారని, పని మీద కార్యాలయానికి వచ్చే వారు అధికారులపై శాపనార్థాలు పెట్టారు.
కద్ర నుంచి 6 గేట్ల ద్వారా నీటి విడుదల
హుబ్లీ: కాళీ నది డెల్టా ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో కద్ర డ్యాం నుంచి 6 గేట్లను తెరిచి నీటిని బయటకు వదులుతున్నారు. జోయిడా, కార్వాడ, కాళీ డెల్టా ప్రాంతంలో విపరీతంగా వానలు పడటంతో కద్ర జలాశయానికి నీటి చేరిక ప్రమాణం పెరిగింది. అంతేగాక ఎగువ భాగంలోని కొడసళ్లి అరణ్య ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నీరు మాత్రం కద్ర జలాశయంలోకి చేరుతుంది. మంగళవారం 6 గేట్లను తెరిచి మొత్తం 51 వేల క్యూసెక్కుల నీటిని కద్ర డ్యాం నుంచి బయటకు వదిలారు. కద్ర కేపీసీ విద్యుత్ కేంద్రం ద్వారా ప్రజలకు జలాశయం నుంచి నీటి విడుదలపై కద్ర డెల్టా ప్రాంతంలోని చుట్టు పక్కల మల్లాపుర, దేవళమక్కి, కేరవడి, ఘోటేగాలి గ్రామాల ప్రజలను భద్రతపై హెచ్చరించారు.
ఉత్తర, కళ్యాణ కర్ణాటకల్లో ముంపు
వరద గుప్పెట వాగులు, వంతెనలు
ఆల్మట్టి నుంచి కృష్ణా నదికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల

కుండపోత వానలు.. నదుల పరవళ్లు

కుండపోత వానలు.. నదుల పరవళ్లు

కుండపోత వానలు.. నదుల పరవళ్లు