
రేపటి నుంచి రక్తదాన శిబిరాలు
రాయచూరు రూరల్ : నగరంలో ఈనెల 22 నుంచి ఐదు రోజుల పాటు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పుట్టుకొస్తుందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహనకు ఇలాంటి శిబిరాలు దోహదపడతాయన్నారు. 22న ఎల్‌వీడీ కళాశాల మైదానంలో, 23న ఐఎంఏ హాలులో, 24న టాగూర్ పాఠశాలలో, 25న మడ్డిపేటలో, 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ శ్యామణ్ణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంతరెడ్డి, గిరీష్, రాజేంద్ర, త్రివిక్రం జోషి, నీలోఫర్‌లున్నారు.
కలబుర్గి ఎయిర్‌పోర్టుకు
ఆ పేరు పెట్టాలి
హుబ్లీ: కళ్యాణ కర్ణాటకలోని ప్రముఖ కేంద్ర స్థానం కలబుర్గి వినామానాశ్రయానికి శరణులు, అన్న, జ్ఞాన, విద్య, సేవా ప్రదాత శ్రమయేవ జయతే అని చాటి చెప్పిన మహా పురుషుడు శరణ బసవేశ్వరుని పేరు పెట్టాలని ఆ జిల్లా రెడ్డి సమాజం అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత ఎస్‌వీ.కామిరెడ్డి ప్రభుత్వానికి ఓ పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో అన్నదాన పద్ధతిని ప్రారంభించి దరిద్రనారాయణులను తృప్తి పరిచారన్నారు. అంతేగాక శ్రమయేవ జయతేని ఆచరించి చూపారన్నారు. అలాంటి మహాపురుషుడి ఆలయం కలబుర్గిలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఇక్కడ శిల్పకళ అమోఘం అని, ఈ ప్రాంతం కళ్యాణ కర్ణాటక శ్రద్ధా కేంద్రం అన్నారు. శరణ బసవేశ్వరుని రథోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. ఆ జాతరకు లక్షలాదిగా ప్రజలు హాజరవుతారన్నారు. ఈ ప్రాంత ప్రజల అరాధ్య దైవమైన శరణ బసవేశ్వరుడి పేరును విమానాశ్రయానికి పెట్టాలని ఆయన కోరారు.