
అలరించిన రాధాకృష్ణులు
బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సామసంద్రపాళ్యలో ఉన్న శ్రీసాయిరామ్ విద్యాసంస్థల ఆవరణలో కృష్ణాష్టమిని ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు చదివే చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. విద్యాసంస్థల అధ్యక్షుడు నితిన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్వరావు, వైస్ ప్రిన్సిపాల్ థామస్‌ప్రాన్సిస్, మేనేజర్ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
బైక్‌లు ఢీ.. ఒకరి మృతి
మైసూరు : చామరాజ్‌నగర్ జిల్లా కొళ్లేగాళ తాలూకా నారిపుర బైపాస్ రోడ్డులో రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తెల్లనూరు గ్రామానికి చెందిన సిద్దశెట్టి(50) తన భార్య మంగళమ్మతో కలిసి బైక్‌పై వెళ్తుండగా నారిపుర వద్ద మరో బైక్ ఎదురైంది. బైక్‌లు పరస్పరం ఢీకొని సిద్దశెట్టి గాయపడగా మైసూరులోని జేఎస్‌ఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ మృతి
మైసూరు : చామరాజ్‌నగర్ జిల్లా కేల్లొగాల్ తాలూకాలోని కెంపనపాళ్య గ్రామంలో బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మరకణించినదికొల్లేగాల్ తాలూకాలోని కంచనగల్లి గ్రామానికి చెందిన శివరుద్రమ్మ(35) కరలకతెదొడ్డి గ్రామం నుంచి స్వస్థలమైన కంచలగల్లికి ద్విచక్రవాహనంపై వస్తుండగా కెంపనపాళ్య గ్రామబైపాస్ రోడ్డుపై అదుపుతప్పి పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను మైసూరులోని కే.ఆర్. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కొళ్లేగాళ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అంతర్గత రిజర్వేషన్లపై
గళం విప్పండి
గౌరిబిదనూరు: ఎస్సీవర్గీకరణకు సంబంధించి అంతర్గత రిజర్వేషన్ల అమలుకు శాసనసభలో ప్రస్తావించాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. నేతలు మాట్లాడుతూ జనసంఖ్యకు అనుగుణంగా, వారి జాతుల ఆధారంగా రిజర్వేషన్లను జారీ చేయవచ్చని జస్టిస్ నాగమోహనదాస్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఏడాది గడిచినా అమలు జరగలేదన్నారు. అంశంపై సభలో గళం విప్పాలని కోరారు. హుదుగూరు నంజుండప్ప, మధుకుమార్, గంగాధరప్ప, వెంకటప్ప, కృష్ణప్ప, రామకృష్ణ, సనంద కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని కూలీ మృతి
దొడ్డబళ్లాపురం: అపరిచిత వాహనం ఢీకొని వలస కూలీ మృతిచెందిన సంఘటన దొడ్డ పట్టణ పరిధిలోని రైల్వేస్టేషన్ సర్కిల్‌లో చోటుచేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని చోళసముద్రం నివాసి బాలాజీ(40) స్థానికంగా ఉన్న ఒక తోటలో కూలిపనికి వచ్చినట్టు తెలిసింది. రైల్వేస్టేషన్ సర్కిల్‌లో నిలబడి ఉండగా అపరిచిత వాహనం ఢీకొంది. ప్రమాదంలో బాలాజీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దొడ్డ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
రమ్య కేసులో ఇద్దరు అరెస్టు
యశవంతపుర: నటి రమ్యకు అనుచితమైన సందేశాలు పంపిన కేసుల్లో మరో ఇద్దరు నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపివాసి ఆదర్శ్, సంజయ్‌లు నిందితులు. ఇప్పటివరకు ఈ కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదర్శర్, సంజయ్ నటుడు దర్శన్ అభిమానులుగా చెప్పుకొంటూ అనేక సందేశాలు పెట్టారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంతకుమార్ సింగ్ తెలిపారు.
తిమ్మరోడిపై బీజేపీ ఫిర్యాదు
యశవంతపుర: సామాజిక మాధ్యమాలలో ద్వేషపూరిత ఆరోపణలు చేసిన మహేశ్‌శెట్టి తిమ్మరోడిపై ఉడుపి జిల్లా కోటె, బ్రహ్మవర పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ శంకర్‌పై ఫేస్‌బుక్‌లో అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఉడుపి జిల్లాలో ఇది కలకలం రేకెత్తించింది. ఓ మతాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటె, బ్రహ్మవర పోలీసులు తిమ్మరోడిపై కేసు నమోదు చేశారు. తిమ్మరోడి ధర్మస్థల మీద, సీఎం సిద్దరామయ్య మీద కూడా వివాదాస్పద ప్రకటనలు చేశాడు.

అలరించిన రాధాకృష్ణులు