
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
దొడ్డబళ్లాపురం: పాఠశాల గోడ కూలి విద్యార్థి గాయపడ్డ సంఘటనకు సంబంధించి బీదర్ తాలూకా బగదల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడయ్యస్వామిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈనెల 7న పాఠశాలో 6వ తరగతి చదువుతున్న రోహన్ రాబర్ట్ అనే విద్యార్థి భోజనం చేస్తుండగా గోడకూలి గాయపడ్డాడు. ముఖ్యోపాధ్యాయుడిని బాధ్యుడిని చేస్తూ అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు
మండ్య: ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. హొసహళ్లి రోడ్డులోని కొన్ని అంగళ్లపై అధికారులు దాడి జరిపి ప్లాస్టిక్ సంచులు స్వాధీనం చేసుకున్నారు. స్థాయీ సమితి అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ప్లాస్టిక్ విక్రయించిన ప్రతి అంగడి యజమానికి రూ.11 వేలకు పైగా జరిమానా విధించామన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ ఇది పునరావృతం అయితే ఎక్కువ ప్రమాణంలో జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరసభ పర్యావరణ విభాగం రుద్రేగౌడ, ఆరోగ్య ఇన్‌స్పెక్టర్ చెలువరాజు, సిబ్బంది అశ్విన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సిటీ బస్‌కు బైకిస్టు బలి
యశవంతపుర: బీఎంటీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బైకుదారుడు మరణించిన ఘటన బెంగళూరు సంజయనగరలో జరిగింది. చిన్నారికి టిఫిన్ తీసుకురావడానికి బైకుపై బయటకు వెళ్లిన వ్యక్తిని బీఎంటీసీ బస్సు ఢీకొంది. సంజయనగరకు చెందిన రోషన్‌ను బస్సు ఢీకొనగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు అందించేలోపే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించి బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
భార్యతో భర్త గొడవ
●మత్తులో తండ్రిని కత్తితో పొడిచిన
తనయుడు
● తీవ్ర గాయలతో మృతి
యశవంతపుర: తల్లితో తండ్రి గొడవ పడుతుండగా మత్తులో ఉన్న తనయుడు కత్తి పొడవటంతో అతను తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా అల్దూరు సమీపంలోని గుప్తశెట్టిహళ్లిలో జరిగింది. గ్రామంలో మంజునాథ్(51) అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈయనకు రంజన్(21) అనే కుమారుడు ఉన్నాడు. మంజునాథ్ ఈనెల 16న తన భార్యతో వాగ్వాదం చేస్తుండగా మద్యం మత్తులో వెళ్లిన రంజన్ సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఓ దశలో తన తండ్రిని కత్తితో పొడిచాడు. గాయంపై భార్య పసువుపొడి వేసింది. అధిక రక్తస్త్రావం కావాటంతో మంజునాథ్ ప్రాణం విడిచాడు. అయితే తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు రంజన్ స్థానికులను నమ్మించాడు. కొడవలి తగిలి గాయమైందని మరికొందరి వద్ద చెప్పాడు. మంజునాథ్ మృతిపై అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంజన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం బయట పెట్టాడు. రంజన్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఓట్ల చోరీని అరికట్టాలి
మైసూరు: దేశంలో భారీగా ఓట్ల చౌర్యం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా సాంస్కృతిక నగరి మైసూరులో స్వాప్ ఓట్ చోరీ అభియాన్‌ను ప్రారంభించింది.సెంట్రల్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులకు స్టిక్కర్లను అతికించి స్వాప్ ఓట్ చోరీ అభియాన్‌ను ప్రారంభించారు. ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగపరచుకుని బీజేపీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతోందన్నారు. వెంటనే ఓట్ల చౌర్యాన్ని అరికట్టి న్యాయసమ్మతంగా ఎన్నికలను నిర్వహించాలని ఒత్తిడి చేశారు. కేపీసీసీ ప్రతినిధి ఎం.లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు విజయకుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్