
బెంగళూరులో భారీగా డ్రగ్ పెడ్లర్ల అరెస్టు
●రూ.5.88 కోట్ల ఎండీఎంఏ, గంజాయి సీజ్
బనశంకరి: బెంగళూరు నగరంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముగ్గురు విదేశీయులతో పాటు 8 మంది డ్రగ్స్ పెడ్లర్లను నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.5.88 కోట్ల విలువచేసే ఎండీఎంఏ , గంజాయి స్వాదీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పరిశీలించి మాట్లాడారు. ఎండీఎంఏ క్రిస్టల్‌ను విక్రయిస్తున్న కాంగో దేశానికి చెందిన జోయల్ కాంబోగ్, మిస్‌జాయ్ సండే అనే ఇద్దరిని అరెస్ట్‌చేసిన పోలీసులు రూ.5 కోట్ల విలువచేసే 2 కిలోల 150 గ్రాముల ఎండీఎంఏని సీజ్ చేశారు. మిస్‌జాయ్‌సండే తక్కువ ధరతో ఎండీఎంఏ క్రిస్టల్ కొనుగోలుచేసి కాలేజీ విద్యార్థులు, ఐటీ బీటీ ఉద్యోగులకు అధిక ధరతో విక్రయిస్తూ సంపాదనకు పాల్పడుతోందని తెలిపారు.
దక్షిణాఫ్రికా వాసి..
మరో ఘటనలో ఆవలహళ్లి మరియప్పరోడ్డులే ఔట్‌లోని ఇంట్లో నివాసం ఉండే దక్షిణాఫ్రికావాసి డెకో స్టాజాన్ ను అరెస్ట్‌చేసి ఇతడి వద్ద నుంచి రూ.40 లక్షల విలువచేసే 255 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వేర్వేరు రకాల వీసాలతో భారత్‌కు వచ్చి బెంగళూరుకు చేరుకున్నారు. సులభంగా ధన సంపాదనకు డ్రగ్స్ విక్రయాలకు దిగారు.
22 కేజీల గంజాయి సీజ్
● హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్ పోలీసులు త్రిపుర రాష్ట్రానికి చెందిన సుబ్బీర్ దేవ్‌వర్మ అనే డ్రగ్ పెడ్లర్‌ని అరెస్ట్‌చేసి రూ.13.50 లక్షల విలువచేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
● సంపిగేహళ్లి పోలీసులు శ్రీరామపుర మెయిన్‌రోడ్డు ఖాళీ స్థలంలో తోట వద్ద ఎండీఎంఏ క్రిస్టల్‌ను విక్రయిస్తున్న బీబీఎం విద్యార్థి వాసీం అక్రమ్ ను అరెస్ట్‌చేసి రూ.3.40 లక్షల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్‌ని స్వాధీనం చేసుకున్నారు.
● యలహంక పోలీసులు ఎంబీఏ ఆటోమొబైల్, బీకాం చదువుతున్న ముగ్గురు విద్యార్థులను అరెస్ట్‌చేసి రూ.15 లక్షల విలువచేసే 117 గ్రాముల ఎండీఎంఏ, కారు, మూడుమొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరు కేరళ నుంచి వచ్చినవారని తెలిసింది.
మొబైళ్ల దొంగ పట్టివేత
మొబైల్ చోరీలకు పాల్పడుతున్న బాపూజీనగర మహమ్మద్ తౌసిఫ్‌ను అరెస్ట్‌చేసిన కోరమంగల పోలీసులు ఇతడి వద్ద నుంచి రూ.16 లక్షల విలువచేసే 48 మొబైల్స్‌ను సీజ్ చేశారు. అలాగే కోరమంగలలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్‌చేసిన పోలీసులు వీరి వద్ద నుంచి కొంత గంజాయిని పట్టుకున్నారు. మొబైల్స్‌ను సొంతదారులను కనిపెట్టి అప్పగిస్తామని కమిషనర్ తెలిపారు.

బెంగళూరులో భారీగా డ్రగ్ పెడ్లర్ల అరెస్టు