
మైసూరు దసరా ఉత్సవాలకు కొత్త గజరాజులు
మైసూరు: ఈసారి అట్టహాసంగా జరుగనున్న విశ్వవిఖ్యాత నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో మూడు కొత్త ఏనుగులు పాల్గొన్నాయి. శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడెయర్ అనే మగ ఏనుగు, 11 ఏళ్ల హేమావతి, రూపా ఏనుగులు పాల్గొంటుండటంతో దసరా పండుగకు మరింత శోభ చేకూరనుంది. ఏనుగుల శిబిరాల్లో చాలా వరకు ఆడ ఏనుగుల వయస్సు 50 దాటినందున వన్యజీవి చట్టాల ప్రకారం వాటిని దసరాకు పిలుచుకొచ్చేందుకు వీలు కాని నేపథ్యంలో ఈసారి మూడు కొత్త ఏనుగులను ఎంపిక చేశారు. గత ఏడాది పాల్గొన్న రోహిత్, హిరణ్య, వరలక్ష్మి ఏనుగుల బదులుగా ఆజానుబాహు శ్రీకంఠ, రూప, హేమావతి ఏనుగులను ఈసారి దసరాకు పరిచయం చేస్తున్నారు. ఈ మూడు కొత్త ఏనుగులు గజపడె కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలో మైసూరులోని రాజ వీధుల్లో కదం తొక్కేందుకు సన్నద్ధం చేశారు. రెండో దశ ఏనుగులను సిద్ధం చేసే ఉద్దేశంతో శిక్షణకు అటవీ శాఖ సిద్ధమైంది.