
డ్యాం గేటు ఊడి నేటికి ఏడాది పూర్తి
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర డ్యాం 19వ గేటు తెగిపోయి నేటితో ఏడాది పూర్తయింది. డ్యాం 19వ గేటుతో పాటు మిగతా మొత్తం 32 గేట్లను తొలగించి అదే స్థానంలో నూతన గేట్లు ఏర్పాటు చేయాలని జలవనరుల నిపుణుల సమితి సూచించింది. లేకుంటే డ్యాం మొత్తానికే ముప్పు తప్పదని హెచ్చరించారు. తుంగభద్ర డ్యాంకు గేట్లు అమర్చే సమయంలో డ్యాంలోకి ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం వలన వరద పోటు ప్రారంభం కావడంతో డ్యాంలో నూతన గేట్ల ఏర్పాటుకు ఆటంకంగా మారింది. కానీ ఈ పనిని డ్యాంలోకి వరద నీటి ప్రవాహం రాక ముందే బోర్డు అధికారులు ప్రారంభించాల్సిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. డ్యాంకు నూతన గేట్ల ఏర్పాటు విషయంలో టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో వేసవిలో డ్యాంకు నూతన గేట్ల ఏర్పాటు పనులు జరగలేదు.
వరద ప్రారంభంతో నిలిచిన పనులు
కానీ బోర్డు అధికారులు నూతన గేట్ల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నూతన గేట్ల మరమ్మతు పనులు ప్రారంభించి 19వ నూతన గేట్‌ను తయారు చేసి సిద్ధంగా ఉంచిన సమయంలో వర్షం వల్ల డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరగడంతో గేట్ ఏర్పాటు పనులు నిలిచి పోయాయి. గుడిలో దేవుడు వరమిస్తే పూజారి వరం ఇవ్వని చందంగా మారింది పరిస్థితి. అత్యాధునిక డిజైన్‌లతో డ్యాం గేట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఆగస్టులో 19వ నెంబరు గేటు కొట్టుకు పోయింది. ఈ నేపథ్యంలో స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌ను ఏర్పాటు చేశారు. కానీ డ్యాంను పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మొత్తం 33 గేట్లు మార్చాలని సూచించింది. డ్యాంను పరిశీలించిన కేంద్ర జల సంఘం( సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) బృందం డ్యాం గేట్ల జీవిత కాలం తీరిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరికాదు. అత్యాధునిక డిజైన్‌తో 33 గేట్లు కొత్తవి ఏర్పాటు చేయడమే ఉత్తమం అని నివేదిక ఇచ్చింది.
అయినా టీబీ డ్యాంకు కొత్త గేట్ల ఏర్పాటులో జాప్యం
మొత్తం 33 గేట్లు మార్చాలని
నిపుణుల కమిటీ సూచన
నెలలు గడిచినా గేట్ల మార్పు దిశగా చర్యలు శూన్యం

డ్యాం గేటు ఊడి నేటికి ఏడాది పూర్తి