
చిన్న కారణానికి ఘర్షణ.. ఒకరి మృతి
హుబ్లీ: జిల్లాలోని కుందగోళ తాలూకా కరబట్టి గ్రామంలో చిన్న కారణంతో రెండు కుటుంబాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన ఒకరు చికిత్స పొందుతూ కేఎంసీ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో వచ్చిన ఆరోపణలతో ముగ్గురిపై కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు గ్రామానికి చెందిన రుద్రప్ప అవారి(70) హత్యకు గురైన వ్యక్తి. ప్రశాంత అవారి, మల్లికార్జున, దారవ్వలపై కేసు దాఖలైంది. నిందితుడు మల్లికార్జున, ఆయన భార్య మధ్య జరిగిన ఘర్షణ విషయమై జోక్యం చేసుకున్న రుద్రప్పపై ఇటుకతో మల్లికార్జున దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రుద్రప్పకు కుందగోళ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం కేఎంసీలో చేర్పించినా ఫలితం దక్కక రుద్రప్ప మృతి చెందాడు. ఘటనపై కుందగోళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ధర్మస్థల మిస్టరీపై
సమగ్ర విచారణకు వినతి
రాయచూరు రూరల్: పవిత్ర క్షేత్రమైన ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలపై విచారణ జరిపి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని ఏఐడీవైఓ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థల మంజునాథుని క్షేత్రంలో జరిగిన సామూహిక మరణాలపై న్యాయాంగ విచారణ చేపట్టాలన్నారు. రాజకీయ ప్రభావంతో సిట్(ఎస్‌ఐటీ) అనే దర్యాప్తు సంస్థ కేసును దారి తప్పిస్తోందన్నారు. 400 మందికి పైగా విద్యార్థినులు, మహిళల కిడ్నాప్, అత్యాచారం వంటి నర మేధాలు జరిగిన విషయాన్ని బహిరంగ పరిచిన బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. సౌజన్య కేసును మూసి వేసి నిందితుల పరంగా నిలవడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
యువత రక్తదానం చేయాలి
రాయచూరు రూరల్ : సమాజంలో ఆపద, అత్యవసర సయమంలో రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని నగర శాసనసభ సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. నగరంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం పట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో శ్రీశైల అమరఖేడ, శ్యామణ్ణ, వెంకణ్ణ, కేశవరెడ్డి, రాజణ్ణ, అరుణ, నాగరాజ్‌లున్నారు.
ట్రాక్టర్‌కు జీపు ఢీకొని బోల్తా
మాలూరు: ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి జీపు ఽఢీకొని బోల్తాపడిన ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వ్యక్తికి చిన్నపాటి గాయాలైన ఘటన తాలూకాలోని టీకల్ ఫిర్కా చిక్కశివార గేట్ సమీపంలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని లక్కూరు గ్రామానికి చెందిన మనోజ్‌గా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ సామలబండె గ్రామానికి చెందిన మంజునాథ్‌కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఘటనలో జీపు నుజ్జయింది. మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

చిన్న కారణానికి ఘర్షణ.. ఒకరి మృతి