
మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలి
సాక్షిబళ్లారి: రాష్ట్రంలో ఎస్సీ కులాల్లో ఒకటైన మాదిగలకు 6 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, ఇందుకు సంబంధించి ఈ నెల 16న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక మాదిగ, ఉపకులాల సంఘటన ఐక్య రాష్ట్ర కన్వినర్ హనుమంతప్ప డిమాండ్ చేశారు. ఆయన శనివారం నగరంలోని పత్రికా భవనంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మినమేషాలు లెక్కిస్తున్నారన్నారు. న్యాయమూర్తి నాగమోహన్ దాస్ నివేదిక సమర్పించిన తర్వాత మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ వ్యతిరేకించే వారికి సానుకూలంగా ముందుకు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట మాదిగలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై మాట్లాడే మంత్రులు ఎందుకు మంత్రి వర్గంలో వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అంతర్గత రిజర్వేషన్ వ్యతిరేకించే వారికి 11 శాతం రిజర్వేషన్ కల్పించి మిగిలిన 6 శాతం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 16న జరిగే మంత్రి వర్గం సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే ఆగస్టు 18న ఫ్రీడమ్ పార్క్ బెంగళూరులోఆందోళన చేసి, ధర్నా చేసి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కార్యాలయాన్ని, ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రూ.39 వేల కోట్ల నిధులు ఎస్సీ,ఎస్టీ సంక్షేమానికి కేటాయించి, వాటిని గ్యారెంటీ పథకాలకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ప్రముఖులు హులుగప్ప, ఈశ్వరప్ప, సోమశేఖర, తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.
6 శాతం రిజర్వేషన్ ఇవ్వక పోతే పోరాటం
కర్ణాటక మాదిగ, ఉపకులాల సంఘటన ఐక్య రాష్ట్ర కన్వినర్ హనుమంతప్ప