
కళ్యాణ కర్ణాటకలో కుంభవృష్టి
రాయచూరురూల్: కళ్యాణ కర్ణాటకను కుంభవృష్టి వర్షాలు కుదిపేశాయి. రాయచూరు, యాదగిరి, గుల్బర్గా జిల్లాల్లో శనివారం రాత్రి ప్రారంభమైన వర్షం ఏకధాటిగా ఆదివారం ఉదయం వరకు కురిసింది. దీంతో అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చొరబడటంతో పేదల ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార్, యరగేర గ్రామాల మధ్య వంతెనలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక గ్రామాలు వరద గుప్పెట చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. చించోళి, విజయపుర మధ్య రహదారిలో నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాల్లో పొలాలు జలావృతం అయ్యాయి. పత్తి, మిరప, పెసలు, కందులు, పొద్దు తిరుగుడు, జొన్న పంటలు నీట మునిగి రైతులు లక్షల రూపాయల మేర నష్టపోయారు.
పొంగిపొర్లిన వంకలు, వాగులు
ఇడపనూరు, పుచ్చలదిన్నె మధ్య నీట మునిగిన వంతెనలు
ఐదు గ్రామాలకు రాకపోకలు బంద్
పంట పొలాలు జలమయం