
రోడ్ల సొగసు చూడతరమా?
సాక్షి,బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.! వందల, వేల కోట్ల రూపాయల నిధులు జిల్లా అభివృద్ధికి ఉన్నాయని ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారే కాని నగరంలోని ప్రతి రోడ్డును సుందరంగా తీర్చిదిద్దేందుకు సీసీ రోడ్లు, తారు రోడ్లు వేయడం మాట అటుంచితే కనీసం నగరంలో ఉన్న రోడ్లలో పడిన గుంతలను పూడ్చేందుకు సమయం కేటాయించకపోవడం, వాటి గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. వాహనాలు నిత్యం రోడ్లలో పెద్ద ఎత్తున సంచరిస్తుండటంతో గుంతలయమంగా మారిన రోడ్లలో ద్విచక్ర వాహనాలు, కార్లలో వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గోతుల రోడ్లతో తరచు ప్రమాదాలు
గుంతలమయంగా రోడ్లు ఉండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నగరంలో ఇటీవల అంటే నెలలోపు వేసిన సీసీ రోడ్లు, తారు రోడ్లు మినహా మిగిలిన రహదారులన్నీ దాదాపు గుంతలమయమే. బెంగళూరు రోడ్డు, విశాల్‌నగర్, కప్పగల్ రోడ్డు, హవంబావిలో పలు రోడ్లు, దొణప్ప స్ట్రీట్, కార్‌స్ట్రీట్, రెడ్డిస్ట్రీట్, కణేకల్లు బస్టాండు రోడ్డుకు అటు, ఇటు వైపుల ఉన్న పలు రోడ్లు, రూపనగుడి రోడ్డు, గణేష్ కాలనీ, సత్యనారాయణపేట, మిల్లార్‌పేట, రామయ్య కాలనీ ఇలా చెప్పుకుంటే పోతే నగరంలో ప్రతి రోడ్డు గుంతలమయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనక దుర్గమ్మ గుడి నుంచి గాంధీనగర్ మీదుగా మోకా రోడ్డుకు వెళ్లే రహదారిలో నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, నగర మేయర్ ముల్లంగి నందీష్‌లకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు కూడా ఇదే రహదారిలో ఉన్నాయి. ఈ రోడ్డు కూడా గుంతలయయంగా మారిందంటే నగరంలో మిగిలిన రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
1200కు పైగా గుంతలు ఉన్నట్లు అంచనా
అధికార లెక్కల ప్రకారం నగరంలో దాదాపు 1200కు పైగా గుంతలు ఉన్నట్లు తేల్చారు. ప్రతి రోడ్డు దాదాపు గుంతలమయంగా మారడంతో బళ్లారి స్టీల్ సిటీనా లేక గుంతల సిటీనా అనే అనుమానం కలుగుతోందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి మాట అటుంచితే కనీసం నగరంలోని రోడ్లను గుంతలు లేకుండా చేయాలని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో రోడ్ల దుస్థితి గురించి సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి సంబంధిత అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సాక్షికి తెలిపారు. నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారని, అయితే ఎప్పుడు గుంతలు పూడుస్తారో వారికే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో ప్రతి రహదారిలోనూ
గుంతలు దర్శనమిస్తున్న వైనం
ఎమ్మెల్యే, మేయర్ ఇల్లు, కార్యాలయాల రోడ్లలో కూడా గోతులే

రోడ్ల సొగసు చూడతరమా?

రోడ్ల సొగసు చూడతరమా?

రోడ్ల సొగసు చూడతరమా?