
వర్షం వచ్చిందా.. వేదవతి వేదన
కణేకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వేదవతి– హగిరినదికి వరద పోటెత్తింది. దీంతో కణేకల్లు–మాల్యం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఉరవకొండ–రాయదుర్గం వయా కణేకల్లు మీదుగా నడిచే ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ఉరవకొండ నుంచి కణేకల్లుకు వచ్చే బస్సులన్నీ మాల్యం గ్రామంలోనే ఆగి, అటు నుంచి అటే ఉరవకొండకు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేదవతి హగిరిపై ఉన్న హెచ్చెల్సీ అక్విడెక్ట్ దుస్థితికి చేరుకోవడంతో హెచ్చెల్సీ అధికారులు వాహనాల రాకపోకలను అనుమతించలేదు. దీంతో ఇన్నాళ్లూ బస్సులన్నీ కణేకల్లు–మాల్యం మార్గంమధ్యలో ఉన్న వేదవతి హగిరి మీదుగా వచ్చి వెళ్లేవి. చిన్నపాటి వర్షానికి వరదనీరు రోడ్డుపైకొస్తుండటంతో బస్సులు, ఇతరాత్రా వాహనాలు వెళ్లలేని పరిస్థితి. హెచ్చెల్సీ అక్విడెక్ట్‌కు సమానంగా రూ.48 కోట్లతో బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయ్యే వరకు ప్రయాణికులు కష్టాలను భరించాల్సిందే. వంతెన పనులను వేగవంతం చేసి త్వరగా ముగించాలని ప్రజలు కోరుతున్నారు.
పొంగిప్రవహిస్తున్న వేదవతి–హగరి నది
కణేకల్లు–ఉరవకొండకు మళ్లీ
రాకపోకల బంద్