
ప్రేమ పేరుతో బాలిక ప్రాణాలు తీశాడు
హొసపేటె: ప్రేమ ముసుగులో బాలికను పెళ్లి చేసుకొని హత్య చేసిన భర్త ఉదంతం నగరంలో వెలుగు చూసింది. ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు ఆమె భర్తతోపాటు అతనికి సహకరించిన తల్లి, ఇద్దరు యులకులను అరెస్ట్ చేశారు. చెప్పరదహళ్లికి చెందిన 17 ఏళ్ల బాలికను నగరానికి చెందిన హమాలీ కార్మికుడు మంజునాథ్ ప్రేమించినట్లు చెప్పి కొన్ని నెలల క్రితం మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వివాహం చేసుకొని హొసపేటకు వచ్చాడు. అయితే మంజునాథ్ మద్యానికి అలవాటు పడి ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. గతంలో దొంగతనాలు చేసినట్లు ఆ బాలిక తెలుసుకుంది. ఈ విషయాలపై ప్రశ్నించగా బాలికను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు తాళలేక బాలిక ఎదురు తిరగడంతో మంజునాథ్ ఆమెను రెండు నెలల క్రితం అంతమొందించాడు. ఇద్దరు స్నేహితులు తరుణ్, అక్బర్ సహాయం తీసుకొని మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకొని మునీరాబాద్ శ్మశానవాటికకు తీసుకెళ్లి పూడ్చి పెట్టారు. అనంతరం ముగ్గురూ మందు పార్టీ చేసుకున్నారు. మరో వైపు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఈనెల 6న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మంజునాథ్‌ను అదుపులోకి తీసుకొని విచారణచేపట్టగా హత్యోదంతం వెలుగు చూసింది. మంజునాథ్ (24), అతని తల్లి లక్ష్మి, అతని స్నేహితులు తరుణ్, అక్తర్‌లను అరెస్టు చేశారు.
మృతదేహం వెలికితీత
విజయనగర ఎస్పీ అరుణంగ్లు గిరి, కూడ్లిగి డివైఎస్పీ మల్లేష్ దొడ్డమణి, టౌన్‌స్టేషన్ పీఐ లఖన్ మసగుప్పి, కోప్పళ్ రూరల్ స్టేషన్ పీఐ సురేష్, కొప్పళ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ మహేష్ శ్మశానవాటికకు వెళ్లి బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పార్టీ చేసుకోవడానికి తరచుగా ఈ ప్రదేశానికి వచ్చేవారమని, దీంతో ఇక్కడ మృతదేహాన్ని పూడ్చి పెట్టామని నిందితులు పేర్కొన్నారు.
హత్యకేసులో నలుగురి అరెస్ట్

ప్రేమ పేరుతో బాలిక ప్రాణాలు తీశాడు

ప్రేమ పేరుతో బాలిక ప్రాణాలు తీశాడు