పన్ను కట్టని క్రికెట్ సంఘం?
బనశంకరి: తొక్కిసలాట తరువాత అధికారుల దృష్టి చిన్నస్వామి మైదానం మీద పడింది. గత కొన్నేళ్లుగా ప్రకటనల ట్యాక్స్ చెల్లించని కేఎస్‌సీఏ కు బీబీఎంపీ నోటీస్ జారీ చేసింది. స్టేడియం లోపల బయట ప్రకటనల్ని ప్రదర్శిస్తే చట్టప్రకారం బీబీఎంపీకి పన్ను చెల్లించాలి. అనేక ఏళ్లుగా స్టేడియంలో ప్రకటన బోర్డులను నిర్వహిస్తున్నారు. సుంకం చెల్లించాలని పాలికె అడిగితే స్పందన రావడం లేదు. క్రికెట్ సంఘం ధోరణితో బీబీఎంపీకి కోట్లాది రూపాయల నష్టం ఏర్పడింది. తాజా పరిణామాల మధ్య పాలికె అధికారులు పెండింగ్ పన్నులను చెల్లించాలని నోటీస్ పంపారు.
నకిలీ బాంబు కాల్..
పీజీ మెడికో అరెస్టు
దొడ్డబళ్లాపురం: మంగళూరులోని కణచూరు ఆస్పత్రికి జూన్ 4న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కణచూరు మెడికల్ కాలేజీ పీజీ ఆస్పత్రి విద్యార్థిని డా.చలసాని మోనిక చౌదరి ని అరెస్టు చేశారు. జూన్ 4న ఉదయం 8:45 సమయంలో కణచూరు ఆస్పత్రిలో బాంబు ఉందని, 11 గంటలకు పేలుతుందని, ఆస్పత్రి మొత్తం ఖాళీ చేయాలని తనకు ఎవరో 5 సార్లు కాల్ చేశారని సదరు విద్యార్థిని మోనిక అధ్యాపకులకు చెప్పింది. దీంతో సుమారు 30 మంది పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో ఆస్పత్రి మొత్తం తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేదు. మోనికనే ఈ నాటకం ఆడినట్టు పోలీసులు కనుగొన్నారు. శనివారం అరెస్టు చేసి ఆమెను విచారించగా ఆ రోజు జరిగే సెమినార్‌కు హాజరు కాకూడదనుకుంది, దీనిని రద్దు చేయించాలని ఈ నాటకం ఆడినట్టు ఒప్పుకుంది.


