తప్పు మీది.. శిక్ష పోలీసులకా?
సాక్షి బెంగళూరు: ఆర్‌సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి క్రీడా మైదానం గేటు వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొక్కిసలాటకు పోలీసుల అధికారుల వైఫల్యమే కారణంగా చూపుతూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి.దయానందతో పాటు ఐదు మంది పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరి సస్పెన్షపై సోషల్ మీడియాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సామాజిక మాధ్యమాల్లో ‘ఐ స్టాండ్ విత్ దయానంద’ పేరుతో హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. జూన్ 3న అర్ధరాత్రి ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుపొందితే జూన్ 4న విజయయాత్ర, విజయోత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌కు సమాచారం ఇస్తే భద్రతా ఏర్పాట్లు ఎలా సాధ్యం అవుతాయి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తక్కువ సమయంలో కార్యక్రమ నిర్వహణ, అందుకు సంబంధించిన భద్రత వ్యవస్థ ఎలా సాధ్యపడుతుందని మండిపడుతున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కల ఆర్‌సీబీ నెరవేర్చడంతో ముందురోజు అభిమానుల అత్యుత్సాహం అందరూ చూశారు. అర్ధరాత్రి దాటినా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలారు. అలాంటి అభిమానులున్న ఆర్‌సీబీ జట్టు బెంగళూరుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఊహించడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలం అయింది. మరోవైపు విజయోత్సవ వేడుక నిర్వహించి తీరాల్సిందేనని ప్రభుత్వంపై ఆర్‌సీబీ తీవ్ర ఒత్తిడి చేసిందని సీఎం సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తెలిపారు. ఎలాంటి ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లు లేకుండా హడావుడిగా ఆర్‌సీబీ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పని ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గందరగోళ వ్యాఖ్యలతో పరిస్థితి విషమం
సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు అత్యంత సూక్ష్మంగా పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నం చేసినా పాలన యంత్రాంగం సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వరలు పదేపదే గందరగోళం కలిగించేలా వ్యాఖ్యలు చేసి మరింత ఆందోళనకరంగా పరిస్థితిని మార్చారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఐదుగురు పోలీసుల సస్పెన్షన్‌పై
ప్రజల్లో ఆగ్రహం
తొక్కిసలాటకు బాధ్యత పోలీసు విభాగంపైకి నెట్టే యత్నం
విజయోత్సవానికి అనుమతిచ్చింది ప్రభుత్వం కాదా? అని ప్రశ్న
పోలీసు కమిషనర్ దయానందకు
నెటిజన్ల నుంచి మద్దతు
కమిషనర్ ఆదేశాలతో నిద్రాహారాలు లేకుండా విధులు
ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని కమిషనర్ దయానంద ఆదేశాలు జారీ చేయడంతో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ నిద్ర మానుకుని విధులకు హాజరయ్యారు. ఉదయం వరకు నిద్రాహారాలు లేకుండా పోలీసులు ఉద్యోగం చేశారు. మళ్లీ మరుసటి రోజు విశ్రాంతి లేకుండా విజయోత్సవాల బందోబస్తు కూడా చేపట్టాల్సి వచ్చింది. దీంతో ఉన్న కొద్దిపాటి సిబ్బందితో విజయోత్సవ కార్యక్రమానికి పోలీసు బందోబస్తును చేపట్టారు. అలాగే మొత్తం నాలుగైదు లక్షల మంది బెంగళూరు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇంత మందిని పర్యవేక్షించేందుకు, బందోబస్తుకు, భద్రతకు కేవలం 1,600 మంది పోలీసులను వినియోగించారు. అన్ని లక్షల మందికి 1600 మంది పోలీసులు ఎలా సరిపోతారని ప్రశ్నలు వస్తున్నాయి. అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించి తప్పును పోలీసు విభాగంపై నెట్టడం ఎంత వరకు సబబు అని ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పోలీసు అధికారుల సస్పెన్షన్ ద్వారా పరిపాలనలో తాము దిట్ట అని, నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థులమని, అయితే వాటిని అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలం అయిందని నిరూపించాలనుకుంటున్నారా? అని మండిపడుతున్నారు.


