5లోగా ఫీజు వివరాలు వెల్లడించండి
హొసపేటె: విజయనగర జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజు వివరాలను జూన్ 5వ తేదీలోపు ప్రకటించాలని, విస్మరిస్తే ఆ పాఠశాలల సమాచారాన్ని జిల్లా వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని విజయనగర జిల్లాధికారి ఎం.ఎస్.దివాకర్ హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయ సభాంగణంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పాలక మండళ్ల సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏ పాఠశాల అయినా అదనపు ఫీజులు వసూలు చేస్తే ఎలాంటి సంకోచం లేకుండా నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు వివరాలను అన్ని పాఠశాలల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలన్నారు.
సమగ్ర సర్వే 86 శాతం పూర్తి
షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేలో పని కోసం వారి వారి నగరాలు, తాలూకాలు, గ్రామాల నుంచి వలస వచ్చిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాల సమగ్ర సర్వే 86 శాతం పూర్తయిందని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని తన కార్యాలయ హాల్లో షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేకు సంబంధించి కమ్యూనిటీ నాయకులు, వివిధ సంఘ సంస్థల ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల సమగ్ర సర్వేపై జస్టిస్ నాగ మోహన్‌దాస్ సింగిల్ మెంబర్ విచారణ కమిషన్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పనులను పూర్తి చేసిందన్నారు. ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలను మినహాయించిందన్నారు. సర్వేలో 14 శాతం మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు.


