
కురుస్తోంది కుండపోత
బనశంకరి: రాష్ట్రంలో గడువుకు ముందుగానే నైరుతి రుతుపవనాలు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కరావళి, మలెనాడుతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో నైరుతి వర్షాలు మరింత చురుకుగా కురుస్తుండటంతో జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఉత్తరకన్నడ జిల్లాలో కుమటా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మూమురు–అరకడ సంబంధాలు తెగిపోయాయి. జిల్లాలో వరద పరిస్థితి తలెత్తింది. ఘాట్ రోడ్లలో కూలిపోయిన బండరాళ్ల ను తొలగించే పనులు జరుగుతున్నాయి.
దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా రోడ్లు జలమయం కావడంతో వాహనాల సంచారానికి ఇబ్బందులు తలెత్తాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపైకి చేరడంతో వాహనాలకు ఇబ్బంది ఏర్పడింది. కరావళి ప్రదేశంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం నెలకొంది.
దక్షిణ కన్నడకు ఎన్డీఆర్‌ఎఫ్
రానున్న రెండురోజులు మంగళూరు తో పాటు కరావళి మరింత జోరుగా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. సహాయక చర్యలకు గ్రామ పంచాయతీల సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న కుండపోతతో ప్రముఖ నాగక్షేత్రమైన కుక్కే సుబ్రమణ్య ఆలయంలో కుమారధార స్నానఘట్టం మునిగిపోయింది. కుమార ధార నది పొంగిపొర్లుతుండటంతో స్నానఘట్టం వద్ద వెళ్లరాదని భక్తులకు సూచించారు. కొన్నిచోట్ల వక్క, కాఫీ తోటల్లోకి నీరు చేరింది. సోమవారం ఉదయం వరకు కొడగు జిల్లాలో విరాజపేటేలో 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భాగమండలలో 23, ముల్కిలో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక్కడ అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కావేరి నదికి ప్రవాహం
కావేరి నది ప్రదేశాల్లో వానల వల్ల జీవనాడిగా పేరున్న మండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్ డ్యాంలో నీటిమట్టం పెరుగుతోంది. వానలు లేక జలాశయం నీటిమట్టం 89 అడుగులకు పడిపోవడంతో దిగులు నెలకొంది. ఇంతలో ముంగారు వర్షాలు జోరందుకోవడంతో ప్రవాహం మొదలైంది. నీటిమట్టం 15 టీఎంసీలను దాటినట్లు తెలిసింది. డ్యాం డెడ్ స్టోరేజీ 7 టీఎంసీలు.
రాష్ట్రంలో ఐదురోజులు వర్షాలు
●రానున్న ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల పరిసర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
● 30వ తేదీ వరకు చాలాప్రాంతాల్లో కుంభవృష్టికి ఆస్కారముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో 5 రోజులు పాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
● బీదర్, కలబుర్గి, యాదగిరి, విజయపుర, బెళగావి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వానలు
ఘాట్ రోడ్లలో విధ్వంసం
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
జలాశయాలకు నీటి చేరిక

కురుస్తోంది కుండపోత

కురుస్తోంది కుండపోత