భూగర్భ డ్రైనేజీ సమస్యలు తీర్చండి
బళ్లారిటౌన్: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున నగరంలో అండర్ డ్రైనేజీలతో పాటు ఓపెన్ డ్రైనేజీలలో నీరు పొంగిపొర్లుతున్నందున ఈ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యేలు నాగేంద్ర, భరత్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పంచాయతీ నూతన భవనంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ సామాన్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీల్లో నీరు ఎక్కువై లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నారు. ఆ నీటిని పక్కదారికి మళ్లించాలన్నారు. అదే విధంగా రాజకాలువ శుభ్రత పనులు కూడా ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు.
విద్యుత్ కోతలపై నిలదీత
ఇటీవల నగరంలో విద్యుత్ కోత విధిస్తున్నందున ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, కోతలు ఎందుకు విధిస్తున్నారని ఆ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో కేఈబీ అధికారి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి రోజుకు 20 మంది కార్మికులతో జంగల్ కటింగ్ చేయిస్తున్నామని వివరణ ఇచ్చారు. నగరానికి విద్యుత్ ఒత్తిడి ఎక్కువైందని మరికొన్ని స్థావరాలు ఏర్పాటు చేయాలని అధికారి తెలియజేయడంతో హవంభావితో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో మరికొన్ని సబ్‌స్టేషన్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.
రైల్వే లైన్‌ను రద్దు చేయమని కోరాం
ఇటీవల ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురాకుండా నగర శివార్లలో బైపాస్ రైల్వే నిర్మాణానికి మ్యాప్ గుర్తించడంపై తాము రైల్వే శాఖ మంత్రి సోమణ్ణ దృష్టికి కూడా తీసుకొచ్చి రద్దు చేయమని కోరినట్లు తెలిపారు. కౌల్‌బజార్‌లోని వేస్టేజ్ నీటి శుద్ధీకరణకు 14వ ఆర్థిక ప్రణాళికలో రూ.150 కోట్లతో ఎస్‌టీపీని రచించిందన్నారు. అయితే వాటి నిర్వహణ కాకున్నప్పటికీ వారికి నిధులు ఎలా చెల్లించారని కార్పొరేటర్ ప్రభంజన్‌కుమార్, మోత్కర్ శ్రీనివాస్, ఇబ్రహిం తదితరులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఈ పథకంలో భారీ అవినీతి జరిగిందన్నారు. దీనిపై ఓ కమిటీ రచించి విచారణ చేపట్టాలన్నారు.
కలుషిత నీటితో ఆకుకూరల సాగుపై గరం
కౌల్‌బజార్ ప్రాంతంలోని పలు పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత నీటిని రైతులు వాడుకొని ఆకుకూరలను పండించి మార్కెట్‌కు తరలిస్తున్నారన్నారు. ఇలాంటి ఆకుకూరలు తింటే ప్రమాదకరం అని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు ఎమ్మెల్యేల సూచన
వాడీవేడిగా కార్పొరేషన్ సమావేశం


