వాయుపుత్ర.. జయహనుమా
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే హనుమాన్ మూలవిరాట్టుకు అభిషేకాలు, పూజలు నిర్వహించిన అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ గావించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గోపూజ చేసి గోమాతకు నూతన వస్త్రాలను సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో 108 కలశాలను ఏర్పాటు చేసి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మండపంలో నెట్టికంటి ఆంజనేయస్వామి వారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి తులసీదళముతో లక్షార్చన పూజను నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వాయుపుత్రున్ని దర్శించుకున్నారు.
కసాపురం క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలు
వాయుపుత్ర.. జయహనుమా


