బాదామి పుష్కరిణి.. నిత్య జలతరంగిణి
రాయచూరు రూరల్: వందలాది సంవత్సరాల నుంచి నీరు ఎండిన దాఖలాలు లేవు. ఉత్తర కర్ణాటకలోని బాదామిలో నిత్యం జలతరంగంతో కళకళలాడుతున్న పుష్కరిణి అందరినీ ఆకట్టుకుంటోంది. మహాకోటేశ్వర పుణ్య తీర్థంలో ఎల్లప్పుడూ జలం ఊరుతూనే ఉంటుంది. చాళుక్య రాజులు నిర్మించిన చారిత్రక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మహాకోటేశ్వర పుణ్యతీర్థం చెప్పుకోదగింది. మహాకోటేశ్వర ఆలయంలో రెండు పుణ్య స్నానాలు ఆచరించే తీర్థాలున్నాయి. వానల కొరత కారణంగా తాలూకాలోని చెరువులు, బావులు ఎండినా బాదామి బనశంకరిలోని రెండు పుష్కరిణిల్లో నీరు అందుబాటులో ఉన్నాయి. ఆరో శతాబ్దంలో చాళుక్య దొరలు మహాకోటేశ్వర, మల్లికార్జున ఆలయం పరిధిలో రెండు పుణ్య స్నానాలు ఆచరించడానికి పుష్కరిణిలను ఏర్పాటు చేశారు. విష్ణు పుష్కరిణిలో భూగర్భ జలం నిరంతరం ఊరుతుంది. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ పుష్కరిణిలో ఉత్తర దిక్కున చతుర్మఖ బ్రహ్మ దేవాలయం, వాయువ్య దిక్కున ఈశ్వరుడి విగ్రహాలను ఈత కొడుతూ వెళ్లి దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది. చిన్న పుష్కరిణిని కాశీ హొండ అంటారు. చిన్న పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అనంతరం విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి మహాకోటేశ్వర, మల్లికార్జున ఆలయంలో దర్శనాలు చేసుకుంటారు. చిన్న పుష్కరిణి కాశీ హొండలో ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పున నీరు పైకి ఎగజిమ్ముతాయి. ఆ నీటిని రైతులు కాలువ ద్వారా వినియోగించుకొని చెరుకు, అరటి, కొబ్బరి, వక్క, మామిడి, నిమ్మ, వేరుశనగ, ఇతర పంటలను పండిస్తారు.
ఎల్లప్పుడూ ఊరుతున్న జలం
నీరు ఎండిన దాఖలాలు లేవు
బాదామి పుష్కరిణి.. నిత్య జలతరంగిణి


