పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
హొసపేటె: నగరంలో గత ఏడాది రైల్వే స్టేషన్ రోడ్డులో జరిగిన హత్య మరువ ముందే నగరంలో మరోసారి హత్య జరగడం నగర ప్రజలను హడలెత్తించింది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి, తలపై బండరాయిని విసిరి దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నగరంలోని జంబునాథ రోడ్డులోని అంబేడ్కర్ నగర్ 4వ క్రాస్ వద్ద జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని హొన్నూరుస్వామి(30)గా పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిందితుడు పారిపోయాడు. ఆరేళ్ల క్రితం మృతుడిపై హత్యాయత్నం కూడా జరిగింది. మొదట కత్తితో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించారు. సంఘటనా స్థలంలో రెండు కత్తులు విరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి హొన్నూరు స్వామి దావణగెరెలో నివాసం ఉంటున్నారు. జంబునాథ జాతర కోసం బుధవారం హొసపేటెకు వచ్చాడు. హత్యకు పాల్పడిన వ్యక్తి నగర నివాసి కాళీ అని తెలియడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జంబునాథ రోడ్డు శివారులో దాకొన్నాడు. ఈ విషయంను గ్రహించిన పోలీసు బృందం హత్య చేసిన నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. నిందితుడు పోలీస్ సిబ్బందిపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో టౌన్ పోలీస్ స్టేషన్ పీఐ హులుగప్ప ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకొని స్వాధీన పరచుకొని నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించారు. హత్య సంఘటన స్థలానికి ఎస్పీ శ్రీహరిబాబు, అదనపు ఎస్పీ సలీం పాషా, డీఎస్పీ మంజునాథ్ చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


