రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. నీరు ముందుకు సాగడం లేదు. దీంతో దుర్వాసన వెలువడుతోంది. నగరంలోని 35 వార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు. చెత్తను తరలించేందుకు కొత్తగా ఆరు ట్రాక్టర్లను నగరసభ అధికారులు కొనుగోలు చేశారు. వాటిని దిష్టిబొమ్మల్లా కార్యాలయ ఆవరణలో నిలిపి ఉంచారు తప్పితే చెత్త తరలించడం లేదు. పేరుకు మాత్రమే జిల్లా కేంద్రమని, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న సదుపాయాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం అధ్వానంగా మారినా అధికారులు, పాలకులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. చెత్త కుప్పల్లో పందులు సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో వైపు పౌర కార్మికుల కొరతతో పనులు జరగడం లేదు. నగరసభ కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా నగరానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆ ప్రభావం పారిశుధ్యంపై పడింది. ఇక నగరంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఏ వీధిలో చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నేతలు నగర అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఆరోపణలు చేసుకుంటున్నారు.
పేరుకుపోయిన చెత్తకుప్పలు
దుర్వాసన భరించలేకపోతున్న
నగరవాసులు
వేధిస్తున్న కార్మికుల కొరత
రాయచూరులో అధ్వానంగా పారిశుధ్యం
రాయచూరులో అధ్వానంగా పారిశుధ్యం