రాయచూరు రూరల్: పంచాయతీ అభివృద్ధి పనులపై సమాచారం అడిగిన కర్ణాటక రాష్ట్ర పార్టీ కార్యకర్తలపై మాన్వి ఎస్‌ఐ సన్న ఈరణ్ణ నాయక్ కులం పేరుతో బెదిరిస్తున్నారని, అలాంటి అధికారిని బదిలీ చేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మంజునాథ్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది క్రితం అరోలి పంచాయతీలో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పక పోవడంతో మాన్వి తాలూకా పంచాయతీ కార్యాలయంలో అధికారిని కలవడానికి వారం రోజుల క్రితం వెళ్లగా పంచాయతీ అధ్యక్షుడు రామస్వామి, సభ్యులు, తమ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. కేసు నమోదు చేయకుండా మూడు రోజుల పాటు వేచి ఉండి రాజీ సంధానం కోసం ఠాణాకు పిలిచి, రాజీ కాకపోతే మీపై ఎస్‌టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించారన్నారు. పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. కులం పేరుతో బెదిరిస్తున్న ఎస్‌ఐని బదిలీ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో రాఘవేంద్ర, ఆశా, వీరేష్‌లున్నారు.
ఎడమ కాలువలో పడి
కూలి కార్మికుడు మృతి
రాయచూరు రూరల్: పని కోసం వెళుతూండగా కూలి కార్మికుడు కాలు జారి కాలువలోకి పడి దుర్మరణం పాలైన ఘటన కొప్పళ జిల్లాలో జరిగింది. ఆదివారం కొప్పళ జిల్లా కనకగిరి తాలూకా చిక్కడంకనకల్‌లో బసవేశ్వర క్యాంపునకు చెందిన హనుమంతప్ప (40) అనే కూలి కార్మికుడు నరేగ పథకంలో పూడికతీత పనులకు వెళుతున్న సమయంలో కాలు జారి ఎడమ కాలువలో పడి ఈత రాక మరణించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక దళంతో పాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా కోసం కొప్పళ ఆస్పత్రికి తరలించారు.
కార్మికుల సమస్యలపై ధర్నా
రాయచూరు రూరల్: వివిధ రంగాల్లో పని చేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్లు స్పందించాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ధర్నాలో అధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విధులు నిర్వహించే వారికి సమాన వేతనాలు, పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యూటీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కనీస వేతనాలు చెల్లించాలని, 8 గంటల పని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి పర్మినెంట్ చేయాలన్నారు. ప్రత్యేక హిందూ దేశం అవసరం లేదని, మనమంతా భారతీయులమని అన్నారు.
ఏప్రిల్ 10 నుంచి
ఆత్మసంస్కార శిబిరం
హుబ్లీ: ధార్వాడ గిరినగర వద్ద ఉన్న పరమాత్మ మహాసంస్థాన మఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుంచి మే 20 వరకు స్కూల్ విద్యార్థులకు ఆత్మసంస్కార అనే వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గురువులను, పెద్దలను గౌవించడం ఎలా? మొబైల్ అతి వినియోగం నుంచి రక్షించుకోవడం ధ్యానం, యోగం, ప్రాణాయామం, పూజలు, ప్రార్థనలు, చిత్రలేఖనం, సంగీతం, నాటకాలు, నాయకత్వ లక్షణాల గురించి వివిధ కళల్లో శిక్షణ ఇస్తారు. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు శిబిరంలో పాల్గొనవచ్చు. ప్రత్యేకించి సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ఈ శిబిరంలో ఉచిత ప్రవేశం ఉంటుంది. మిగిలిన వారికి అతి తక్కువ ఫీజు నిర్ణయించారు. ఆసక్తి గల వారు 9886314809 నంబరులో సంప్రదించాలని ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
మాన్వి ఎస్‌ఐని బదిలీ చేయాలి
మాన్వి ఎస్‌ఐని బదిలీ చేయాలి