సాక్షి,బళ్లారి: బిసలు బళ్లారిగా ఖ్యాతి పొందిన బళ్లారి జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 నుంచే భానుడు మండుతున్నాడు. మధ్యాహ్నం సమయానికి వడగాలులు వీస్తున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. మార్చిలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, మధ్యాహ్నం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పాఠశాలు, కళాశాలు కూడా యధావిధిగా నడుపుతుండటంతో విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ, లేదా టవాల్ ధరించాలని సూచిస్తున్నారు.
పుచ్చకాయలకు డిమాండ్
ఎండలతో ఉపశమనం కోసం ప్రజలు చల్లనీ పానీయాలు, పుచ్చకాయలను ఆశ్రయిస్తున్నారు. ఇంటినుంచి బయటకు వచ్చిన సమమయంలో కొబ్బరి బొండాలను తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దీంతో నగరంలో ఎటు చూసినా పుచ్చకాయల విక్రయాలు జోరందుకున్నాయి. రాయల్ సర్కిల్ నుంచి సంగం సర్కిల్, ఎంజీ పెట్రోల్‌బంక్, ఎస్పీ సర్కిల్ తదితర ప్రముఖ రోడ్లలో పుచ్చకాయలు వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. ఒక్కో కొబ్బరి బొండం ధర రూ.60తో విక్రయిస్తున్నారు.
మట్టికుండల కొనుగోలుకు ఆసక్తి
ఎండకు వెళ్లి వచ్చిన వారు మట్టికుండలోని ఒక గ్లాసుడు నీటిని తాగితే చెప్పలేనంత ఊరట లభిస్తుంది. అందుకే వేసవిలో ప్రతి ఇంటిలోనూ మట్టికుండకు చోటు దక్కుతుంది. ఈక్రమంలో మట్టికుండల విక్రయాలు జోరందుకున్నాయి.
బళ్లారిలో పెరుగుతున్న ఎండల తీవ్రత
40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
చల్లటి పానీయాలను ఆశ్రయిస్తున్న జనం
కొబ్బరి బొండాలకు డిమాండ్
అప్పుడే భానుడి భగభగలు
అప్పుడే భానుడి భగభగలు