
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలో వీధికుక్కలు స్వైర విహారం చేసాయి. ఒక్కరోజులోనే 20 మందిపై దాడిచేసి గాయపరిచాయి. గాయపడ్డ వారిలో నాలుగేళ్ల బాలిక ఉండడం గమనార్హం. దొడ్డ పట్టణ పరిధిలోని గాణిగరపేటలో రాజీవ్ అనే వ్యక్తి కుమార్తె స్వీకృతి (4)పై వీధికుక్కలు దాడి చేసాయి. వెన్ను, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఇక పట్టణ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 20 మందిని వీధి కుక్కలు కరిచాయి. గాయపడ్డవారు పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. నగరసభ అధికారుల నిర్లక్ష్యమే కారణమని జనం ధ్వజమెత్తారు.
చిక్కిన చిరుత
దొడ్డబళ్లాపురం: గత కొన్నిరోజులుగా మాగడి పట్టణం పరిధిలోని గవి గంగాధరేశ్వర దేవాలయం పరిసరాల్లో సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేసిన చిరుతపులి బోనులోకి చిక్కింది.
ఈ చిరుత తరచూ బయటకువస్తూ వీధికుక్కలను ఎత్తుకెళ్లేది. చిరుతను బంధించాలని ప్రజలు కోరడంతో అటవీ సిబ్బంది బోనును ఏర్పాటు చేయగా మంగళవారం తెల్లవారుజామున బోనులో పడింది. అటవీ సిబ్బంది దానిని తరలించారు.