ప్రపంచ మేయర్ల సదస్సుకు కొలగాని శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ మేయర్ల సదస్సుకు కొలగాని శ్రీనివాస్‌

Nov 25 2026 12:20 AM | Updated on Nov 25 2026 12:20 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రతిష్టాత్మక మూడో ప్రపంచ మేయర్ల ఫోరం అంతర్జాతీయ సదస్సులో నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆహ్వానం అందడంతో మంగళవారం రాత్రికి ముంబాయి చేరుకున్నారు. ముంబాయిలోని ఫెయిర్‌మాంట్‌ హోటల్‌ వేదికగా బుధ,గురువారం రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాల్లోని 30 నగరాల మేయర్‌లు, దేశంలోని వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. బుధవారం మొదటిరోజు 2047 నాటికి నగరాలను పునర్నిర్మించడం, అర్టిఫిషియల్‌ ఇంటిలీజెన్స్‌ ఆధారిత భవిష్యత్‌నగరాల నిర్వహణ, పట్టణ వ్యర్థాల సమస్య పరిష్కారం, సర్క్యులర్‌ సిటీస్‌, ప్రపంచ పెట్టుబడుల ద్వారా అభివృద్ధి తదితర అంశాలపై చర్చ ఉంటుంది. రోజు గురువారం నగరాలను మరింత సురక్షితంగా మార్చడం, నదీ నగరాల అభివృద్ధి, ప్రజల ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చే పట్టణ రవాణా వ్యవస్థ, నెట్‌ జీరో మౌళిక సదుపాయాలు, వాతావరణ సంక్షోభం ఎదుర్కోవడం, మెట్రోపాలిటన్‌ పాలన బలోపేతం, క్రీడా దౌత్యం ద్వారా ఆరోగ్యకరమైన నగరాల నిర్మాణం వంటి అంశాలపై చర్చ అనంతరం సదస్సును ముగిస్తారు.

మెడికోల ఆందోళన విరమణ

కొత్తపల్లి(కరీంనగర్‌): వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూల ప్రకటనతో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనను మంగళవారం విరమించారు. బుధవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతామని ప్రకటించారు. కొత్తపల్లిలోని కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల భవనంతో పాటు వసతి గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ మెడికోలు చేపట్టిన ఆందోళన విషయం విదితమే. ఈ మేరకు విద్యార్థులతో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తఖీయూద్దీన్‌ ఖాన్‌, రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో బిల్లా కోటేశ్వర్‌, తహసీల్దార్‌ వెంకటలక్ష్మి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. నవంబర్‌ చివరి నాటికి బాలికల హాస్టల్‌, డిసెంబర్‌ చివరి నాటికి బాలుర హాస్టల్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు.

హుజూరాబాద్‌ జిల్లా కోసం మళ్లీ ఉద్యమిస్తాం

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో మరోసారి ఉద్యమబాట పట్టాలని జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సమావేశమై మాట్లాడారు. 2016లో ప్రారంభమైన జిల్లా ఉద్యమం పదేళ్లు గడుస్తున్నా ప్రతిపాదన ముందుకు సాగకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లా ఏర్పాటు అంశాన్ని చేర్చినా ఇప్పటివరకు కార్యాచరణ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసి 16 మండలాలతో హుజూరాబాద్‌ను నూతన జిల్లాగా ప్రకటించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, వర్ధినేని రవీందర్‌రావు, హుజూరాబాద్‌ క్లబ్‌ కార్యదర్శి కట్కూరి మల్లారెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రావణ్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు సొల్లు బాబు, తాళ్లపల్లి రమేశ్‌, తాటిపల్లి రాజన్న, జిల్లా సాధన కమిటీ కన్వీనర్‌ బి.మోజు సదానందం పాల్గొన్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనుల కారణంగా బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు 11 కె.వీ.మల్కాపూర్‌ ఫీడర్‌ పరిధిలోని స్వామికాలనీ, ఇందిరమ్మ కాలనీ, రేకుర్తి కంటి ఆస్పత్రి, ఆంజనేయకాలనీ, విజయదుర్గకాలనీ, బుడిగె జంగాల కాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement