● బయట చెప్పవద్దని కర్రతో చితకబాదిన ప్రిన్సిపాల్ ● చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నంకు ఫిర్యాదు చేసిన తండ్రి
లక్డీకాపూల్: కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లోని మైనారిటీ గురుకుల బాలుర–1 పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడటమే కాకుండా, విచక్షణారహితంగా దాడి చేసిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి కంద మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గత నెల 6న పాఠశాలలోని తోటి విద్యార్థులు తన కుమారుడిని ర్యాగింగ్ చేసి, బలవంతంగా మద్యం తాగించి దాడి చేయడంతో పాటు మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ వీర్ల మహేష్‌కు చెప్పడంతో బయట చెప్పవద్దని తన కుమారుడినే కర్రతో తీవ్రంగా కొట్టాడని పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది బాలుడికి జ్వరం వచ్చిందని తమకు ఫోన్ చేసి అబద్ధం చెప్పారన్నారు. పాఠశాలకు వెళ్లి చూస్తే ఒంటిపై వాతలతో అపస్మారక స్థితిలోకి ఉన్నాడని, వెంటనే కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నంకు వివరించగా.. బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిని ఆదేశించారన్నారు.


