విరిసిన పూలు.. పలకని ధర | - | Sakshi
Sakshi News home page

విరిసిన పూలు.. పలకని ధర

Nov 25 2026 12:20 AM | Updated on Nov 25 2026 12:20 AM

పెట్టుబడి కూడా తిరిగి రాలేదు

మార్కెట్‌లో ధరలు లేక రైతుకు తీరని నష్టం

రూ.70 వేల పెట్టుబడి బూడిదపాలు

రవాణా ఖర్చులకూ గిట్టుబాటు కాక తొలగింపు

ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతు వేడుకోలు

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట కళ్లముందే పూసినా.. చేతికి రూపాయి రాకపోతే ఆ రైతు ఆవేదన వర్ణనాతీతం. అందంగా విరబూసిన బంతిపూల తోటను చూసి మురిసిపోవాల్సిన రైతు.. మార్కెట్‌లో ధరలు లేక, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో గుండె బరువెక్కి ట్రాక్టర్‌తో దున్నించేశాడు.

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన వీరముష్టి వెంకటేశ్‌ ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన బంతిపూల తోటను మంగళవారం తొలగించాడు. నర్సరీ నుంచి ఒక్కో మొక్కను రూ.5 చొప్పున కొనుగోలు చేసి, సాగు, కూలీల ఖర్చులతో కలిపి సుమారు రూ.70 వేలు పెట్టుబడి పెట్టాడు. దసరా తర్వాత మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో పూల విక్రయాల ద్వారా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పూలు పూసి వాడిపోతున్నా.. చేసేదేమీ లేక తోటను ట్రాక్టర్‌తో దున్నించేశాడు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఇలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నాడు.

ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారుల ప్రోత్సాహంతో ఎకరం పొలంలో రూ.70 వేల పెట్టుబడితో బంతిపూల సాగు చేశాను. తీరా పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. పూలను విక్రయిస్తే రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో మనసు చంపుకుని పూల తోటను ట్రాక్టర్‌తో దున్నించేశాను. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.

– వీరముష్టి వెంకటేశ్‌, గూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement