మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారికి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నేటితో వీక్లీ రైళ్ల నిలిపివేత
రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాకపోకలు సాగించే తిరుచానూరు(07603) నాందేడ్‌తోపాటు జల్నా–తిరుపతి(07814) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బుధవారం రద్దు కానున్నాయి. గత జూన్, జూలై నుంచి ఉమ్మడి జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట ప్రాంతాల ప్రయాణికులకు సేవలు అందించాయి. తిరుచానూరు, శ్రీకాళహాస్తి, తిరుపతి, కాణిపాకం వెళ్లే వేలాది మంది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేవి. వీటిని యధావిధిగా నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా, బుధవారం నుంచి కాజీపేట, రామగుండం మీదుగా నడిచే దాణాపూర్–బెంగళూరు కంటోన్మెంట్(03241) ప్రత్యేక రైలు మధ్యాహ్నం కాజీపేటకు, బెంగళూరు–దాణాపూర్ మధ్య నడిచే(3242) ప్రత్యేక రైలు మరుసటి రోజు సికింద్రాబాద్, కాజీపేటకు చేరుకుంటాయి. అదేవిధంగా దాణాపూర్–ఎర్నాకులం(03221) ప్రత్యేక రైలుకు బల్హర్షా, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. చర్లపల్లి–రాక్సల్(05527/28) రైలుకు కాజీపేట, రామగుండం, బల్హర్షాలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
పంజగుట్ట: అమీర్‌పేటలో పనిచేస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన కామిని సుజాతకు మధుసూదన్‌తో వివాహమైంది. ఆయన బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తూ.. అమీర్‌పేటలోని రాజేష్ ఫర్నిచర్ షాప్ వద్ద ఫైనాన్స్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 20న సాయంత్రం 5 గంటల సమయంలో అమీర్‌పేటలోని వీఆర్‌కే సిల్క్స్‌లో పనిచేస్తున్న భార్య వద్దకు మధుసూదన్ వెళ్లి సుమారు అరగంటపాటు మాట్లాడాడు. అనంతరం ఫర్నిచర్ షాప్‌కని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు రాత్రి 7.20కి భార్య ఫోన్ చేయగా.. కస్టమర్‌తో పనిలో ఉన్నానని చెప్పాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఫైనాన్స్ ఉద్యోగిని సంప్రదించగా.. మధుసూదన్ ఈనెల 20 నుంచి 22 వరకు మూడురోజుల సెలవు పెట్టినట్లు తెలిపాడు. తాను స్వగ్రామమైన జగిత్యాల జిల్లా తాటిపల్లి వెళ్లి తల్లిదండ్రులను కలుస్తానని మాత్రమే తనకు చెప్పాడని భార్య అంటోంది. ఆగస్టు 31న కూడా ఇదే విధంగా చెప్పి వెళ్లి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని, అప్పట్లో ఐదు రోజుల తర్వాత అత్తమామల ఇంటి వద్ద అతడిని వెతికి పట్టుకున్నట్లు తెలిపారు. ఈసారి బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


