కుటుంబాలకు తీరని శోకం
● ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు ● బందనకల్‌లో మిన్నంటిన విషాదం ● ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహేశ్ ● కేసీఆర్ దిగ్భ్రాంతి.. పాడె మోసిన మాజీ ఎంపీ సంతోష్‌రావు
కలల వయసులోనే కాలం కాటేసింది. కుటుంబాలకు అండగా నిలుస్తారనుకున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు ప్రమాదానికి గురికావడంతో ముస్తాబాద్ మండలం బందనకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముస్తాబాద్: ముస్తాబాద్ ఎస్సై జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. బందనకల్‌కు చెందిన కస్తూరి మహేందర్‌రెడ్డి (23), మొగిలిపూల భరత్ (21), మారెడ్డి జశ్వంత్‌రెడ్డి (23) సోమవారం రాత్రి ఒకే ద్విచక్రవాహనంపై ముస్తాబాద్‌కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జశ్వంత్‌రెడ్డి సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం అనంతరం పరారైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ మహేశ్ బి.గీతే, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వర్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీంతో ప్రమాద కారణాలను పరిశీలించారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎంపీ పరామర్శ
మహేందర్‌రెడ్డి ఎరవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అతడి మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి నర్సారెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ సంతోష్‌రావు గ్రామానికి చేరుకుని మహేందర్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వయంగా పాడె మోసి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మహేందర్ పాడె మోస్తున్న మాజీ ఎంపీ సంతోష్‌రావు
మహేందర్‌రెడ్డి(ఫైల్)
భరత్(ఫైల్)
మహేందర్‌రెడ్డి తల్లి మూడేళ్ల క్రితమే మృతి చెందగా, తండ్రి, చెల్లెలు, నానమ్మకు అతడే ఆధారం. మరోవైపు భరత్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రితోపాటు కుటుంబ బాధ్యతలను భరత్ చూసుకునేవాడు. ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు ఎస్పీని కోరగా, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో భరత్ పోస్టుమార్టం ప్రక్రియను సింగిల్‌విండో చైర్మన్ తన్నీరు బాపురావు పర్యవేక్షించారు. ఇద్దరు యువకుల అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి.


