వీబీ జీరాంజీ పనులపై నిఘా | - | Sakshi
Sakshi News home page

వీబీ జీరాంజీ పనులపై నిఘా

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

● నూతన సాప్ట్‌వేర్‌ రూపకల్పన ● ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ

కరీంనగర్‌ అర్బన్‌: గ్రామాల్లో వలసలు నివారించి ఉపాధి కల్పించే ఉద్దేశంతో కొనసాగుతున్న ‘వీబీ జీ రాంజీ’ పథకాన్ని పారదర్శకంగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిఘాను తీవ్రతరం చేసింది. ఏమైనా లోటుపాట్లున్నా, అభ్యంతరాలున్నా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తుండగా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. పథకం ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి గడువుతో కూడిన బహుళ అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. జిల్లా, మండల, గ్రామ పంచాయతీస్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిర్యాదు తీవ్రత, స్థాయిని బట్టి అధికారులు విచారించనున్నారు. ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను సైతం వెల్లడిస్తారు.

గ్రామం యూనిట్‌గా పనులు

ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఎనిమిది నెలలపాటు చిన్న, సన్నకారు రైతులు, దివ్యాంగులు, మహిళలకు మరింత ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిశాఖ కృషి చేస్తోంది. జిల్లాలో చేపట్టిన భూగర్భ జలాల సంరక్షణ, ఇంకుడుగుంతలు, నీటి కుంటలు, బోరుబావుల రీచార్జ్‌ పనులు చేపట్టారు. వీటిని పటిష్ఠంగా చేసేందుకు ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పోర్టల్‌ ద్వారా పనులు సక్రమంగా చేయాలని నిర్ణయించారు.

వీజీపీపీతో పురోగతి

గ్రామ పంచాయతీ ప్రణాళిక(వీజీపీపీ) ద్వారా పంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రజలకు అవసరమైన పనులు గుర్తించి ఒక్కో పంచాయతీకి ప్రత్యేక గుర్తింపును కల్పించి పోర్టల్‌లో పొందుపరుస్తారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా వసతుల కల్పన, తాగునీరు, పారిశుధ్యం, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి పనులు చేస్తారు. వీటితో పాటు సహజ వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిని పంచాయతీ స్థాయిలోనే చర్చించి పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే చేసిన పనులను తొలుత పోర్టల్‌లో పొందుపరుస్తారు. దీంతో ఒక్కసారి చేసిన పనులను మరోసారి చేయకుండా యుక్తధార పోర్టల్‌ గుర్తిస్తుంది. పోర్టల్‌ పనితీరుపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

జిల్లాస్థాయిలో పర్యవేక్షణ

ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లాస్థాయి సమన్వయకర్త పర్యవేక్షిస్తారు. పథకానికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. వ్యక్తిగతంగా, సంబంధిత అధికారికి నేరుగా, స్పీడ్‌ పోస్టు ద్వారానైనా పంపొచ్చు. ఫిర్యాదు స్వీకరించిన రోజే సంబంధిత అధికారి దాన్ని డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారుకు రసీదును డిజిటల్‌ లేదా నేరుగా అందించాల్సి ఉంటుంది. నమోదైన ప్రతి ఫిర్యాదును అధికారులు పరిశీలించి ఏడు రోజుల్లోగా విచారణ చేపట్టి, 15 రోజుల్లోగా పరిష్కరించేందుకు గడువు విధించారు. విచారణ తుది దశలో ఉండగా ఫిర్యాదుదారు వాదనలకు అవకాశం కల్పిస్తారు. చివర్లో నివేదికను ఫిర్యాదుదారుడికి అందించాల్సి ఉంటుంది. పరిష్కార నివేదికపై అభ్యంతరాలుంటే వీబీ జీ రాంజీ చట్టంలోని షెడ్యూల్‌–1లోని నిబంధనల ప్రకారం అప్పీలుకు వెళ్లవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement