పప్పు దినుసులకు బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

పప్పు దినుసులకు బోనస్‌

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

క్వింటాల్‌కు రూ.500 అదనం చొప్పదండి సహకార సంఘం వినూత్న నిర్ణయం ఇతర సంఘాలూ అనుసరించాలి వ్యవసాయ అధికారులకు కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశం

కరీంనగర్‌: పప్పు దినుసులు సాగుచేసే రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించేలా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చేపట్టిన వినూత్న కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్‌ చిత్రామిశ్రా అన్నారు. ఈ విధానం రైతులకు అదనపు ఆదాయం కల్పించడంతోపాటు పప్పు దినుసుల సాగు విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర సహకార సంఘాలు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణా ళికతో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మండలాలవారీగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఆయిల్‌పా మ్‌ విస్తరణకు వ్యవసాయ, ఉద్యానశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ పందిళ్లు, డ్రిప్‌, స్ప్రింక్లర్ల ఏర్పాటుకు రైతులకు సహకరించాలని సూచించారు. వీబీ జీరామ్‌జీ పథకం కింద 200 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో జలసిరి పనులు

భూగర్భ జలాల పెంపునకు ఇంటింటా ఇంకుడు గుంతలు, పొలాల్లో నీటి కుంటలు, తాగునీటి బోర్లకు రీచార్జ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాబార్డు, డీసీసీబీ పథకాలపై రైతులకు అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్‌, ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి, డీఆర్డీవో గీత, జిల్లా పశువైద్యాధికారి లింగారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement