జిల్లాలో ఇటీవల నమోదైన ఉష్ణోగ్రతలు
ఊపిరితిత్తులకు ముప్పు
జిల్లాలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు
దగ్గు, జలుబు, జ్వరాలతో ఆస్పత్రులకు బారులు
చిన్నారులు, వృద్ధులకు న్యూమోనియా ప్రమాదం
శ్వాస ఇబ్బందులుంటే నిర్లక్ష్యం చేయవద్దంటున్న వైద్యులు
కరీంనగర్: చలితీవ్రత పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో న్యూమోనియా ముప్పు ఎక్కువగా ఉండటంతో వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2–3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉండటంతో చలి నుంచి రక్షణతోపాటు అనారోగ్య లక్షణాల ను గుర్తించి చికిత్స పొందాలని సూచిస్తున్నారు.
జలుబుతో మొదలై.. న్యూమోనియా వరకు
చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ముక్కు కారడం, తుమ్ములు, గొంతునొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో మొదలయ్యే సమస్యలు కొందరిలో తీవ్రరూపం దాల్చవచ్చు. ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరితే బ్రాంకై టిస్, న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంది. న్యూమోనియాతో ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో ద్రవం లేదా చీము చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.
చిన్నారులు, వృద్ధులపై ప్రభావం
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు, వృద్ధులు ఇన్ఫెక్షన్ల బారిన త్వరగా పడే అవకాశం ఉంది. గర్భిణులు, మధుమేహం, గుండెజబ్బులు, ఆస్త మా, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, తగ్గని దగ్గు, కఫం, ఛాతినొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల్లో పాలు తాగకపోవడం, నీరసం, శ్వాస సమయంలో ఛాతి లోపలికి లాగినట్లు కనిపించడం ప్రమాద సంకేతాలు.
అప్రమత్తతే రక్ష
చలిగాలుల నుంచి రక్షణకు వెచ్చని దుస్తులు ధరించాలి. ఇళ్లలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. పొగ, ధూళి, కాలుష్యానికి దూరంగా ఉండాలి. పోషకాహారం, తగిన నిద్రతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించడంతోపాటు వైద్యుల సూచన మేరకు అర్హులైనవారు ఫ్లూ, న్యూమోకాకల్ టీకాలు తీసుకోవాలి. సొంతంగా మందులు వాడకుండా వైద్యుల సలహా పొందాలి.
చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. న్యూమోనియా లక్షణాలను సాధారణ జలుబుగా భావించకూడదు. జ్వరం, తీవ్రమైన దగ్గు, కఫం, ఛాతినొప్పి, శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్
చిన్నారులను చలిగాలుల నుంచి రక్షించేందుకు వెచ్చని దుస్తులు ధరింపజేయాలి. చేతుల పరిశుభ్రత పాటించాలి. వయసుకు తగిన టీకాలు వేయించాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు టీకాలు తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించుకోవచ్చు.
– వాసుదేవ్, జీజీహెచ్ పిల్లల వైద్యనిపుణుడు


