సమస్యలపై గళమెత్తిన సభ్యులు
నగరవ్యాప్తంగా భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడుగుంతలు నిర్మిస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 66 డివిజన్లలో డివిజన్ కు రూ.2లక్షల చొప్పున కేటాయించి, టెండర్ చేపట్టామన్నారు. నూతనంగా భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టే సమయంలో అనుమతి పత్రాల జారీ కోసం తప్పనిసరి ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలనే నిబంధనను పెట్టామన్నారు. నగరంలో ఫంక్షన్ హాల్స్, ఇతర చోట్ల ఎక్కడ ప్లాస్టిక్ వాడినా సంబంధిత సంస్థలకు రూ.5 వేల నుంచి రూ.25వేల జరిమానా విధించేందుకు తీర్మానించినట్లు తెలిపారు. వీధిదీపాల కొనుగోలుకు రూ.70 లక్షలతో ఒకటి, రూ.95 లక్షలతో మరొకటి ఐదేళ్ల వారంటీతో టెండర్ ప్రక్రియ చేపట్టామన్నారు. కోతులు, కుక్కల బెడద నివారణకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందన్నారు. సిటీలో చేయుత పెన్షన్ల కింద మొత్తం 6వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఇందులో 3,812 పెన్షన్ మంజూరు పత్రాలు అందించామన్నారు. ఇంకా కొన్ని పెన్షన్ మంజూరు పత్రాలు రావాల్సి ఉందన్నారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే, జరిమానాలు విధించేలా అధికారులను ఆదేశించామన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 47 వేల అసెస్మెంట్లకు భువన్ సర్వే కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేకాధికారి పాలనలో రెండో నల్లా కనెక్షన్ తీసుకొనే అవకాశాన్ని ఎందుకు తొలగించారని డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీలో రూ.100 కోట్లు పెట్టి ఐసీసీసీ ఏర్పాటు చేశామని, నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. నగరంలో పది చోట్ల ఎయిర్ సెన్సార్ పరికరాలు అమర్చినప్పటికీ, ఉన్నాయో, లేవో ప్రజలకు తెలియడం లేదన్నారు. ఏడువేల చోట్ల ఆర్‌ఎఫ్ ఐడీ టాక్స్ స్కానర్లను ఎక్కడ అమర్చారో చెప్పాలన్నారు. అవి అమర్చకుండానే బిల్లులు చెల్లించారనే అనుమానాలున్నాయన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ సంస్థపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పైప్‌లైన్ పనులు పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. వైద్యుల అంజన్‌కుమార్ మాట్లాడుతూ లీకేజీతో 30శాతం నీరు వృథాగా పోతోందన్నారు. నీటివృథాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని అధికారులను నిలదీశారు. వీధి దీపాల సమస్యతో నగరం అంధకారంగా మారిందని, లైట్లు పెట్టిన రెండు రోజులకే వెలగడం లేదన్నారు. ఆకుల నందిని మాట్లాడుతూ హౌసింగ్‌బోర్డుకాలనీలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. బల్దియాలో అక్రమాల ఆరోప ణలపై విచారణ చేపట్టాలని సూచించారు. కొలిపాక రమ్య మాట్లాడుతూ డివిజన్‌లో గతంలో కబ్జాకు గురైన వార్డు ఆఫీసు స్థలానికి ప్రహరీ ఏర్పాటు చేయాలన్నారు. నలువాల పుష్పలత మాట్లాడుతూ రూపాయి అంత్యక్రియలకు రెండు డప్పులే వస్తున్నాయని, నాలుగు డప్పులకు పెంచాలని సూచించారు.


