● ఎకరానికి ఐదారు క్వింటాళ్లు దాటని వరి దిగుబడి ● మారుమూల పల్లె రైతులకు అంటగట్టిన వ్యాపారీ ● బిజీగా అధికారులు.. గుట్టుగా సెటిల్‌మెంట్
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరి నకిలీ విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అంటగట్టిన వ్యాపారుల మాయాజాలం బుధవారం వెలుగులోకి వచ్చింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ పెడతామని జిల్లా అధికారులు హెచ్చరించినా వారి బుద్ధి మారలేదు. పంట కోసిన రైతులు దిగుబడి రాకపోవడంతో లబోదిబోమంటూ వ్యవసాయాధికారులను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు విత్తనాల్లో లోపముందని విత్తన వ్యాపారీతో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. సిరిసిల్లకు చెందిన సదరు విత్తనాల వ్యాపారీతో మాట్లాడగా.. గుట్టుగా కొంతమంది రైతులకు ‘లక్ష’ణంగా పరిహారం చెల్లించినట్లు తెలిసింది. ఈ సంగతి తెలియని అనేక మంది జిల్లాలోని రైతులు దిగుబడి రాదనే దిగులుతో ఉన్నారు.
నమ్మకంగా నయవంచన
కోనరావుపేట, వీర్నపల్లి మండలాల రైతులకు జిల్లా కేంద్రానికి చెందిన ఓ విత్తన వ్యాపారీ వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో వరి నకిలీ విత్తనాలు అంటగట్టాడు. నమ్మకంగా ఆ విత్తనాలను తీసుకెళ్లి రైతులు నాట్లు వేశారు. కానీ పంట కోత సమయంలో పొలమంతా గింజలు లేకపోవడం.. వట్టి గొలక మాత్రమే ఉండడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. హార్వెస్టర్‌తో వరి కోస్తే ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల ధాన్యం రావాల్సి ఉండగా.. ఐదారు క్వింటాళ్లకు మించి రాలేదు.
విచారిస్తే బాధితులకు న్యాయం
ఈ ఘటనపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతమంది రైతులకు ఏయే విత్తనాలు సరఫరా అయ్యాయి.. లోపం ఏమిటీ.. ఎంత మంది నష్టపోయారో తేలితే వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే వ్యవసాయాధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లు సమాచారం.
‘మామూలు’గా తీసుకున్న అధికారులు
కోనరావుపేట, వీర్నపల్లి మండలాల రైతులు కొందరు వ్యవసాయశాఖ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. దిగుబడి రాని వరి గురించి ఫిర్యాదు చేస్తే.. క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని చట్టపరిధిలో నకిలీ విత్తనాలను అందించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కానీ అంతా ‘మామూలు’ వ్యవహారంగా తీసుకుని ‘సెటిల్‌మెంట్’ చేసుకోవాలని సలహా ఇవ్వడం గమనార్హం. కోనరావుపేట మండలం నిజామాబాద్ ఎల్లమ్మ ఆలయం వద్ద విత్తనాల వ్యాపారీతో సెటిల్‌మెంట్‌కు కూర్చోగా.. చాలా మంది రైతులు రావడంతో అడ్డాను సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు మార్చినట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.1.90 లక్షలు వరకు విత్తన వ్యాపారీ నష్టపరిహారం చెల్లించినట్లు తెలిసింది. వ్యాపారీ మోసాలు తెలియని అనేక మంది రైతులు దిగుబడి లేని పంటను చూసి గుండెలు బాదుకుంటున్నారు.
ఫిర్యాదు అందలేదు
వరి నకిలీ విత్తనాలు సరఫరా అయినట్లు మాకు ఫిర్యాదు అందలేదు. నకిలీ విత్తనాలు అని ఎవరు తేల్చారో తెలియదు. మండల వ్యవసాయాధికారులు ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదు. నేను సెలవులో ఉన్నాను. విత్తనాలు నకిలీవి అయితే.. ఆ కంపెనీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధిత రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బయట జరిగిన సెటిల్‌మెంట్‌తో మాకు సంబంధం లేదు.
– అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయ అధికారి


