● పల్లెల్లో నీటి పథకాల పనితీరు పరిశీలన ● పని చేయనివాటికి మరమ్మతుకు చర్యలు ● నీటి ఎద్దడి నివారణపై మొదలైన స్పెషల్ డ్రైవ్
మంథనిరూరల్: ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులు పల్లెబాట పట్టారు. వేసవి ప్రారంభం కాకముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఈ నెల 16 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో తాగు నీటి పథకాల పనితీరుపై సమగ్ర పరిశీలన చేసి రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
జిల్లాలోని 263గ్రామపంచాయతీల్లో అధికారులు తాగునీటి ఎద్దడి నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఎన్ని తాగునీటి పథకాలు ఉన్నాయి, అందులో ఎన్ని పని చేస్తున్నాయి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, మోటార్ల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించనున్నారు. నెల పాటు ఆయా గ్రామాల్లో ప్రతీ పథకాన్ని పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసి రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టనున్నారు.
జిల్లాలో నీటి పథకాలు
జిల్లావ్యాప్తంగా 3,358 చేతిపంపులు, 535 సింగిల్ ఫేజ్, 595 త్రీఫేజ్ మోటార్లతో నడిచే పథకాలు, 280బావులు ఉన్నాయి. కాగా గతేడాది వేసవికి ము ందు అధికారులు క్షేత్రస్థాయిలో నీటి పథకాలను ప రిశీలించి నివేదికలు సమర్పించారు. మళ్లీ ఎన్‌నినో ప్రభావంతో వేసవికి ముందే స్పెషల్ డ్రైవ్ చేపట్టి నీ టి పథకాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 702 రక్షిత మంచినీటి పథకాలు, 350 చేతిపంపులు, 280 బా వులు మాత్రమే వినియోగంలో ఉన్నట్లు అధికారుల నివేదికల్లో ఉండగా, తాజాగా ప్రతీ చేతిపంపు, రక్షిత మంచినీటిపథకాలను పరిశీలించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నా రు. భగీరథ ద్వారా నీటి సరఫరాలో ఎప్పుడైనా అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికకన చేతి పంపులు, బోరుమోటార్లను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
పరిశీలనలో మండలస్థాయి అధికారులు
20 రోజుల పాటు జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఎంపీడీవో, ఎంపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, గ్రిడ్ ఏఈ, స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బృందంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తాగునీటి పథకాలను పరిశీ లిస్తారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
నీటి సమస్య రాకుండా చర్యలు
గ్రామాల్లో ఎలాంటి నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్పెషల్‌డ్రైవ్ చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నీటి పథకాలను పరిశీలిస్తున్నాం. భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే తాత్కాలికంగా నీటి సరఫరా అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నం.
– దాసరి రాజ్‌కుమార్,
డీఈ ఆర్‌డబ్ల్యూఎస్, మంథని


