కరీంనగర్ జిల్లాలో మధుమేహం కేసులు ఇలా..
కరీంనగర్: ఒకప్పుడు మధ్యవయస్కుల్లోనే ఎక్కువగా కనిపించే మధుమేహం ఇప్పుడు యువతనూ వెంటాడుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిడి వ్యాధి ముప్పును పెంచుతున్నాయి. గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఫాస్ట్‌ఫుడ్, నిద్రలేమి, అధిక కేలరీల ఆహారం తీసుకోవడం కూడా కారణాలుగా మారుతున్నాయి. చిన్న వయసులోనే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుండటంతో అప్రమత్తత అవసరం. ముందస్తు పరీక్షలు, జీవనశైలిలో మార్పులతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు. నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా శరీరం దానిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ చరిత్రతో పాటు అధికంగా అన్నం, మైదా పదార్థాలు, తీపి పానీయాలు, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం ముప్పును పెంచుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలి. చక్కెర పానీయాలు, అధిక కొవ్వు పదార్థాలను పరిమితం చేయాలి.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 4,13,210 మందికి మధుమేహ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, 23,200 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు ఎన్‌సీడీ విభాగం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా మరో రెండింతలు ఉంటే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. చాలామందిలో ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడంతో వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. తరచూ దాహం వేయడం, మూత్ర విసర్జన ఎక్కువ కావడం, ఆకలి పెరగడం, బరువు తగ్గడం, అలసట, చూపు మసకబారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, శారీరక శ్రమ తక్కువగా చేసేవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
ఎన్‌సీడీ విభాగం గణాంకాలు మొత్తం స్క్రీనింగ్ : 4,13,210 మధుమేహం నిర్ధారణ : 23,200


