● సీపీవో నిధుల్లో చేతివాటం ఫలితం ● పనులు చేయకుండానే రూ.మూడు లక్షలు డ్రా ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన చైర్పర్సన్ నాగలక్ష్మి ● పది రోజుల క్రితమే సెలవుపై వెళ్లిన కమిషనర్
ధర్మపురి: ప్రజాపాలనలో భాగంగా సమావేశాలు ఏర్పాటు చేయకున్నా.. చైర్పర్సన్ సంతకం లేకుండా రూ.మూడు లక్షలు డ్రా చేసి.. ఇతరుల ఖాతాలకు పంపించిన ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావును కలెక్టర్ సత్యప్రసాద్ కలెక్టరేట్‌కు సరెండర్ చేశారు. ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పనులు, సౌకర్యాలపై కమిషనర్ చైర్పర్సన్, వార్డు కౌన్సిర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలను తెలియజేయాలని సూచించింది. అయితే కమిషనర్ శ్రీనివాస్‌రావు మాత్రం కేవలం 14వ వార్డులోనే సమావేశం ఏర్పాటు చేసి అన్ని వార్డుల్లో చేపట్టినట్లు రికార్డు సృష్టించి నిధులు డ్రాచేశాడు. చైర్పర్సన్ సంతకం లేకుండానే రూ.మూడు లక్షలు డ్రా చేసి ఓ ఫంక్షన్‌హాల్ యజమాని ఖాతాకు మళ్లించినట్లు తెల్సింది.
కలెక్టర్‌కు చైర్పర్సన్ ఫిర్యాదు
తన సంతకం లేకుండా నిధులు డ్రా చేసిన కమిషనర్ శ్రీనివాస్‌రావుపై చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి గతనెల 10న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్‌ను విచారణ చేపట్టాలని సూచించారు. నిధులు డ్రా చేసింది నిజమేనని తేలడంతో కమిషనర్‌ను కలెక్టరేట్‌కు సరెండర్ చేసినట్లు సమాచారం. తనకు సమాచారం ఇవ్వకుండా నిధులు డ్రా చేసిన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని చైర్పర్సన్ కలెక్టర్‌ను కోరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గంలోనే కమిషనర్ చేతివాటం ప్రదర్శించి సరెండర్ కావడం చర్చనీయాంశంగా మారింది.


