వైద్యుల నిర్లక్ష్యం.. వికలాంగునికి శాపం | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యం.. వికలాంగునికి శాపం

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

● సర్టిఫికెట్‌ జారీలో తప్పిదం

● సర్టిఫికెట్‌ జారీలో తప్పిదం

జగిత్యాలరూరల్‌: వైద్యుల నిర్లక్ష్యం ఓ దివ్యాంగుడికి శాపంగా మారింది. మంచానికే పరిమితమైనా అధికారులు మాత్రం సదరెం సర్టిఫికెట్‌ జారీ చేయడం లేదు. జగిత్యాలరూరల్‌ మండలం సోమన్‌పల్లి గ్రామానికి చెందిన నీలం గంగన్న రైతు. 2025 మేలో వ్యవసాయ మోటార్‌కు విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మరమ్మతు చేస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి కిందపడిపోయాడు. గాయపడిన గంగన్నను ఆస్పత్రిలో చేర్పించగా.. నడుము విరిగిపోయిందని, కిందిభాగం పనిచేయదని నిర్ధారించారు. అప్పటినుంచి గంగన్న మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులు సదరెం సర్టిఫికెట్‌ కోసం 2025 జూలైలో దరఖాస్తు చేశారు. పరీక్షించిన వైద్యులు అతడికి 90 శాతం వైకల్యం ఉందని, నడవలేడని ధ్రువీకరిస్తూ ఏడాది కాలం పరిమితితో సదరెం సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఆ గడువు ముగియడంతో 2026లో సదరెం సర్టిఫికెట్‌ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోగా.. వైద్యులు 73శాతమే అంగవైకల్యం ఉన్నట్లు రెండేళ్ల కాలపరిమితికి సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీనిపై బాధితుడు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వైకల్యశాతం తగ్గించి సర్టిఫికెట్‌ ఇస్తే ప్రభుత్వపరంగా అందే సహాయం విషయంలో తనకుఅన్యాయం జరుగుతుందని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ వైకల్యాన్ని నిర్ధారించాలని కోరాడు. అధికారులు మాత్రం బాధితుడు పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు భావించి ఆ ఫిర్యాదును డీఆర్డీఏకు బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో బాధితుడు దిక్కులేని స్థితిలో పడిపోయాడు. కలెక్టర్‌ స్పందించి తన పరిస్థితిని పరిశీలించి వైద్య బృందాన్ని పంపించి 90 శాతం వైకల్యంతో కూడిన సర్టిఫికెట్‌ మంజూరు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement