మెట్‌పల్లిరూరల్: గేదెను తప్పించబోయి ఓ ఆటో బోల్తాపడిన ఘటన మెట్‌పల్లి శివారు ఆరపేట వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామానికి చెందినవారు ఆటోలో మంగళవారం రేగుంటలోని ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నారు. ఆరపేట సమీపంలోని వంతెన వద్దకు రాగానే ఆటోకు గేదె అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో పదిమంది ఉండగా.. ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో రోజా, సంజన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెల్సింది. డ్రైవర్ రాజుకు కాళ్లు విరిగినట్లు తెలిసింది. గాయపడిన కొందరిని మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని జగిత్యాల, కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. మెట్‌పల్లి సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.


