త్వరలో లక్షమందితో ‘మహా పాదయాత్ర’ | - | Sakshi
Sakshi News home page

త్వరలో లక్షమందితో ‘మహా పాదయాత్ర’

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కోర్‌ కమిటీతో కేంద్ర మంత్రి సంజయ్‌ భేటీ

జన సమీకరణ, ఏర్పాట్లపై చర్చ

కరీంనగర్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ త్వరలో కరీంనగర్‌ రానున్న నేపథ్యంలో ‘మహా పాదయాత్ర’ను సక్సెస్‌ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయించారు. కనీసం లక్ష మందితో కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. యాత్ర ఏర్పాట్లపై మంగళవారం ఎంపీ కార్యాలయంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కోర్‌ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ త్వరలో నితిన్‌ నబిన్‌ తొలిసారి కరీంనగర్‌ రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్‌ పేరు మారుమోగేలా ‘మహా పాదయాత్ర’ను విజయవంతం చేయాలని సూచించారు. ‘సర్‌’ పై కాంగ్రెస్‌, ఇండీ కూటమి పేరుతో విపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని నీరుగార్చే కుట్రలతో రాజ్యంగ సంస్థలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే నితిన్‌ నబిన్‌ వస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో మీడియా, సోషల్‌ మీడియా ద్వారా విస్త్రృత ప్రచారం నిర్వహించాలన్నారు. కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపి, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, బాస సత్యనారాయణ, గంగాడి కృష్ణారెడ్డి, కోమాల అంజనేయులు, నల్లాల ఓదెలు, మోహన్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్‌ రావు పాల్గొన్నారు.

నగర సమగ్రాభివృద్ధి లక్ష్యం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్‌ తెలిపారు. మంగళవారం నగరపాలకసంస్థ 50వ డివిజన్‌ పరిధిలోని జ్యోతినగర్‌లో మున్సిపల్‌ సాధారణ నిధులు రూ.79.20 లక్షలతో చేపట్టనున్న ఆర్‌సీసీ డ్రైనేజీ, స్లాబ్‌ కల్వర్ట్‌ పనులకు మేయర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, గుగ్గిళ్లపు రమేశ్‌, కార్పొరేటర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement