జిల్లాలో తాగునీటి పథకాల వివరాలు
ఎల్‌నినోపై మండల కమిటీ సమావేశాలు ప్రారంభం
ఈనెల 15 నుంచి గ్రామాల్లో నీటి వనరులపై సర్వే
26 నుంచి మరమ్మతు పనులు
కరీంనగర్ రూరల్: ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ చిత్రామిశ్రా చైర్మన్‌గా జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. 15 మండలాల్లో వివిధశాఖల అధికారులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశా రు. గ్రామాల్లో తాగునీటి సమస్యలపై చర్చించేందుకు ఈనెల 14వరకు మండలస్థాయి సమావేశాలను ఏర్పాటు చేశారు. మంగళవారం తిమ్మాపూర్, చిగురుమామిడి, చొప్పదండి, ఇల్లంతకుంట మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. బుధవారం గంగాధర, హుజూరాబాద్, గన్నేరువరం, కొత్తపల్లి మండలాల్లో, 12న రామడుగు, సైదాపూర్, మానకొండూరు, 13న శంకరపట్నం, వీణవంక, కరీంనగర్‌రూరల్ మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా మండలస్థాయి కమిటీ సమావేశాల్లో గ్రామాల్లోని తాగునీటి వాస్తవ పరిస్థితులపై సమీక్షించి నీటి ఎద్దడి నియంత్రణ చర్యలకు కార్యచరణ రూపొందిస్తారు. కమిటీలు రూపొందించిన ప్రతిపాదనల మేరకు కలెక్టర్ తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తారు.
15 నుంచి గ్రామాల్లో సర్వే
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈ నెల 15 నుంచి డిసెంబరు 31వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 15నుంచి 25 వరకు ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి వనరులను గుర్తిస్తారు. మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా జరుగుతుందా లేదా అని పరిశీలిస్తారు. గ్రామాల్లోని అన్ని వాటర్‌ట్యాంకులకు భగీరథ నీటి సరఫరాను లింక్ చేశారా లేదా, చేతిపంపులు, తాగునీటి బావుల విద్యుత్ మోటార్లు, నీటి పథకాల పనితీరును పరిశీలించి నివేదిక రూపొందిస్తారు.
26 నుంచి మరమ్మతు పనులు
ఆయా గ్రామాల్లో తాగునీటి వనరుల మరమ్మతు పనులను ఈ నెల 26 నుంచి డిసెంబరు 31వరకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో చెడిపోయిన చేతిపంపులు, పైపులైన్లు, గేట్‌వాల్వ్ లీకేజీలకు మరమ్మతు చేపడుతారు. తాగునీటి సమస్యను గుర్తించిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, బావులను అద్దెకు తీసుకుంటారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు పైపులైన్ల నిర్మాణం, వీబీజీరామ్‌జీ పథకంలో బోర్లలో భూగర్భ జలమట్టం పెరిగేలా రీచార్జీ గుంతల తవ్వకం తదితర పనులు చేపడతారు.
రాబోయే వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు ప్రారంభించాం. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 15నుంచి తాగునీటి వనరులపై క్షేత్రస్ధాయిలో సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే 54 హ్యబిటేషన్లలో తాగునీటి సమస్యను గుర్తించాం. రూ.1.20 కోట్లతో నియంత్రణ చర్యలకు ప్రతిపాదన రూపొందించాం. సర్వే అనంతరం పూర్తిస్థాయిలో తాగునీటి ఎద్దడి నియంత్రణకు నిధుల మంజూరు కోరుతూ ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపిస్తాం.
– శ్రీనివాస్, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్, కరీంనగర్
మొత్తం తాగునీటి పథకాలు: 354 తాగునీటి బావులు: 527 చేతిపంపులు: 3,191 సింగిల్ ఫేజ్ మోటార్లు: 1,978


