‘శాతవాహన’లో అరణ్య రోదన! | - | Sakshi
Sakshi News home page

‘శాతవాహన’లో అరణ్య రోదన!

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

వర్సిటీలో జోరుగా మట్టి తవ్వకాలు

ఎడాపెడా చెట్ల నరికివేత.. తరలింపు

కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం

జాతీయ పక్షి ఆవాసాల విధ్వంసంపై విద్యార్థుల ఆగ్రహం

పరిస్థితిని స్వయంగా పరిశీలించిన డీఎఫ్‌వో

పీసీబీకి యూనివర్సిటీ ఐకాస ఫిర్యాదు

పీసీబీకీ విద్యార్థుల ఫిర్యాదు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

రాష్ట్రంలో అటవీ ప్రాంతాలు లేని జిల్లాల్లో ఒకటి హైదరాబాద్‌ అయితే.. రెండోది కరీంనగర్‌గా చెప్పుకోవచ్చు. జిల్లాలో కాస్తో కూస్తో పచ్చదనం ఉందంటే అదీ ఉజ్వల పార్క్‌, శాతవాహన యూని వర్సిటీ లాంటి ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే. పర్యావరణానికి, పచ్చదనానికి నిలయమైన శాతవాహన యూనివర్సిటీలో కొంతకాలంగా యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టి తవ్వకాలు వాకర్లు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇష్టానుసారంగా సాగుతున్న మట్టి తవ్వకాలు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరుస్తున్నాయని, చెట్ల నరికివేతతో జాతీయ పక్షి నెమలితో పాటు అనేక పక్షుల ఆవాసాలు చెదిరిపోతున్నాయని వర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతి లేకుండా చెట్లు నరికారు: డీఎఫ్‌వో

శాతవాహన వర్సిటీలో చెట్ల నరికివేత విషయం గురించి విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది. కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లా అటవీశాఖ అధికారులు మంగళవారం వర్సిటీని సందర్శించారు. వర్సిటీలో పలు అటవీ జాతి చెట్లను నరికినట్లు గుర్తించామని డీఎఫ్‌వో సత్యనారాయణ వెల్లడించారు. ఎన్ని చెట్లు నరికారన్న దానిపై తమ సిబ్బంది ఎన్యుమరేషన్‌ చేస్తున్నారని, అది ముగిశాక నరికిన చెట్ల ఆధారంగా కాంట్రాక్టరుకు జరిమానా విధిస్తామన్నారు. అవసరమైతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జాతీయ పక్షి ఆవాసాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ముప్పువాటిళ్లిన దాఖలాలు కనిపించలేదని, చెట్ల నరికివేతకు అనుమతి లేదు కాబట్టి జరిమానా రెట్టింపు చేస్తామని, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు నోటీసులు అందజేస్తామని డీఎఫ్‌వో వివరించారు. కొత్తపల్లి తహసీల్‌ అధికారులు సైతం మట్టి తవ్వకాలపై విచారణ చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ ఇంజినీర్‌ అధికారులు వారికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వర్సిటీలో జరుగుతున్న తవ్వకాలన్నీ కేవలం సర్దుబాటు అని, ఎలాంటి లాభాపేక్ష, ఆర్థిక ప్రయోజనాలు లేవని వివరించినట్లు సమాచారం.

తొలగించిన చెట్లు

పీసీబీకి ఫిర్యాదు చేసిన వర్సిటీ విద్యార్థి నాయకులు

వర్సిటీలో మట్టి తవ్వకాలు

గ్యాలరీ, లా కళాశాల, సింథటిక్‌ ట్రాక్‌ వంటి అభివృద్ధి పనుల పేరుతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీగా తవ్వకాలు చేపట్టి, విలువైన మట్టిని బయటకు తరలిస్తున్నారని, పెద్దపెద్ద వృక్షాలు నరికేస్తున్నారని వర్సిటీ విద్యార్థులు మంగళవారం పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ చర్యలతో క్యాంపస్‌లో దుమ్ము, శబ్దకాలుష్యంతో పాటు సహజ పర్యావరణం, జీవవైవిద్యం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెమళ్లతో పాటు అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు కనిపించేవని, ప్రస్తుతం వాటి సహజ ఆవాసాలు ధ్వంసం కావడంతో జీవాల ఉనికి గణనీయంగా తగ్గిపోయిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎస్‌యూ జేఏసీ చైర్మన్‌ కరికె మహేశ్‌, ఎస్‌యూ అధ్యక్షుడు కేశవ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ కన్వీనర్‌ శివాజీ, లక్ష్మణ్‌సాయి, ప్రవీణ్‌, శ్రీధర్‌, శంకర్‌, ప్రవీణ్‌, ఓంప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement