యువతతోనే వికసిత్‌ భారత్‌ | - | Sakshi
Sakshi News home page

యువతతోనే వికసిత్‌ భారత్‌

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

యువతతోనే వికసిత్‌ భారత్‌

కరీంనగర్‌ సిటీ: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే సూచించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ కళాశాలలో వికసిత్‌ భారత్‌ యువ పార్లమెంట్‌–2027 జిల్లాస్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. ‘నషా ముక్త యువ వికసిత్‌ భారత్‌’ అంశంపై నిర్వహించిన పోటీలను అదనపు కలెక్టర్‌, స్థానిక సంస్థల అధికారి అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను, దేశ భవిష్యత్‌ను దెబ్బతీస్తుందన్నారు. మత్తు రహిత యువతతోనే ఆరోగ్యవంతమైన సమాజం, వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీలకు 165మంది విద్యార్థులు హాజరయ్యారని, ప్రతిభ కనబరిచిన ముగ్గురిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని తెలిపారు. స్థానిక కార్పొరేటర్‌ రమణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పి.నితిన్‌, టి.రాజయ్య, అర్జున్‌, రాజేందర్‌, తిరుపతి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, సంజీవ్‌, సత్యప్రకాశ్‌, రాజేశ్‌, స్వరూపరాణి, ఆర్చన, కళాజ్యోతి పాల్గొన్నారు.

ఎస్‌బీని తనిఖీ చేసిన సీపీ

కరీంనగర్‌క్రైం: స్పెషల్‌ బ్రాంచ్‌ కార్యాలయాన్ని మంగళవారం సీపీ గౌస్‌ ఆలం తనిఖీ చేశారు. వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, ఉద్యోగ ధ్రువీకరణ, పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్ల (పీవీసీ) జారీ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్దేశిత గడువులోగా వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా విభాగం పనితీరును సమీక్షించిన సీపీ, క్షేత్రస్థాయి అధికారుల కార్యాచరణపై వివరాలు తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వానికి తావివ్వకుండా పారదర్శకంగా పనిచేయాలని నిర్దేశించారు. ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ అనిల్‌, డీఏవో విరాజ్‌ పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,790

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.8,790 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 56 వాహనాల్లో 516 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్‌ ధర రూ.8,700, కనిష్ట ధర రూ.8,200కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

నేటి నుంచి శుభ గడియలు

కరీంనగర్‌ కల్చరల్‌: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తికమాసం నవంబర్‌ 10 నుంచి ప్రారంభమైంది. 11 నుంచి 2027 జనవరి 2వ తేదీ వరకు వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన రోజులు ఉన్నాయని నగర ప్రధాన వైదిక పురోహితుడు మంగళంపల్లి శ్రీనివాసశర్మ తెలిపారు. నవంబర్‌ 13న నాగుల చవితి, 16న తొలి కార్తిక సోమవారం, 21న తులసీ కల్యాణం, 24న కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, డిసెంబర్‌ 7న చివరి కార్తిక సోమవారం, మాస శివరాత్రి పర్వదినాలు రానున్నాయని వివరించారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ కొత్తపల్లి ఎక్స్‌ప్రెస్‌ ఫీడర్‌ పరిధిలోని కొత్తపల్లితో పాటు రెడ్డిరాంపల్లి, తూర్పువాడ, మెడికల్‌ ఏరియా, రామాలయం తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement