పాపం.. పసివాడు! | - | Sakshi
Sakshi News home page

పాపం.. పసివాడు!

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

పాపం.. పసివాడు! క్షీణించిన పిల్లాడి ఆరోగ్యం పిల్లాడు జగిత్యాలలోనే జన్మించాడు

దత్తత సరిగా జరగలేదంటున్న అధికారులు

కన్నవారు, దత్తత తీసుకున్నవారిపై పోలీసు కేసు

హైకోర్టు మధ్యంతర ఉతర్వుల రద్దుకు అధికారుల పోరాటం

2023లో పిల్లాడు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలోనే జననం

కలెక్టర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్న న్యాయవాది

బాలుడి భవితవ్యంపై సర్వత్రా ఆందోళన

నెలాఖరున పిల్లాడి మూడో పుట్టినరోజు

ఈ రెండు నెలల్లో బాబు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాదాపు రెండు కిలోలకుపైగా బరువు తగ్గాడని, మానసిక ఆరోగ్యం దెబ్బతిందని, నిద్రలో పదేపదే ఉలిక్కి పడి లేచి ఏడుస్తున్నాడని తల్లిదండ్రులు, న్యాయవాది క్యాస రఘునందన్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ను జిల్లా అధికారులు తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. పిల్లాడి ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌ను వివరణ కోరగా.. పిల్లాడి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో రిట్‌ దాఖలు చేసిన విషయాన్ని అంగీకరించారు. దాని వల్ల పిల్లాడు దూరమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులు సుప్రీంకోర్టులో 160కిపైగా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసును సైటేషన్‌గా తీసుకుని వారంతా కోర్టులను ఆశ్రయిస్తారన్న కారణంతో రిట్‌ దాఖలు చేశామని వివరించారు.

జిల్లా అధికారులు అసలు పిల్లాడు లక్ష్మణ్‌– సుమలతలకు జన్మించలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని శ్రీనివాస్‌ లాయర్‌ రఘునందన్‌రెడ్డి ఖండిస్తున్నారు. ఈ కేసులో కలెక్టర్‌ను జిల్లా అధికారులు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో 2023 నవంబరులో పిల్లాడు జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో జన్మించినట్లుగా బర్త్‌ సర్టిఫికెట్‌ వెలుగులోకి రావడం బాబు బంధువుల్లో చర్చకు దారితీసింది. ఒకవేళ జిల్లా అధికారుల అనుమానం నిజమైతే.. పిల్లాడికి జగిత్యాల మున్సిపల్‌ అధికారులు బర్త్‌ సర్టిఫికెట్‌ ఎలా జారీ చేస్తారు? అందులో అతని తల్లిదండ్రులుగా లక్ష్మణ్‌–సుమలత పేర్లు ఎలా పొందుపరుస్తారు? అన్న ప్రశ్నను బాబు తరపు బంధువులు లేవనెత్తుతున్నారు.

తల్లిదండ్రులతో బాలుడు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

‘అమ్మా.. నాకు భయమేస్తోంది..రాత్రిపూట ఒక్కడినే పడుకోలేకపోతున్నా.. నన్ను తీసుకుపో’ అంటూ మూడేళ్ల చిన్నారి దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదనలు సోషల్‌ మీడియాను కుదిపేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు బాలుడికి మద్దతుగా నిలిచారు. పిల్లాడి విడుదలను పరిశీలించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. చివరికి మంత్రులు జోక్యంతో ఆ పసివాడు తల్లి ఒడి చేరాడు. కానీ, ఆ ఆనందం వారికి ఎన్నో రోజులు నిలిచేలా లేదు. బాబును తీసుకెళ్లడాన్ని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారులు సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కథ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే ఒళ్లంతా గాయాలతో, ఎలర్జీతో బాధపడుతున్న బాలుడు.. శారీరకంగా, మానసికంగా చాలా కుంగిపోయాడు. ఈ నెలాఖరున చిన్నారి మూడో పుట్టినరోజు సమీపిస్తున్న వేళ.. మళ్లీ తల్లి ఒడికి దూరమైతే.. అతని మానసిక పరిస్థితి మరింత దిగజారుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

జగిత్యాలకు చెందిన క్యాసరపు శ్రీనివాస్‌ దంపతులకు సంతానం లేదు. దీంతో నిజామాబాద్‌కు చెందిన లక్ష్మణ్‌– సుమలత దంపతుల కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు 1098 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా జిల్లా సీ్త్రశిశు సంక్షేమశాఖకు ఫిర్యాదు చేశారు. దత్తత చెల్లదంటూ ఆగస్టు 26న అధికారులు పిల్లాడిని హోంకు తరలించారు. దత్తతలో అక్రమాలు జరిగాయంటూ శ్రీనివాస్‌గౌడ్‌, సరిత, లక్ష్మణ్‌– సుమలతపై జిల్లా సంక్షేమ అధికారుల ఫిర్యాదుతో జగిత్యాల పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో శ్రీనివాస్‌ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. పిల్లాడి అప్పగింతను పరిశీలించాలని జిల్లా అధికారులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయినా వారు పిల్లాడిని తల్లికి అప్పగించలేదు. ఈ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలంటూ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఈ పరిణామంపై తల్లిదండ్రులతోపాటు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement