ఏం చేస్తున్నారు.. ఎలా చదువుతున్నారు | - | Sakshi
Sakshi News home page

ఏం చేస్తున్నారు.. ఎలా చదువుతున్నారు

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

తరగతి గదిలో ప్రతి విద్యార్థిపై ఇక నిఘా

ఎవరి చదువు ఎంత? ఎక్కడ వెనకబాటు?

డిజిటల్‌ లెక్కలతో వెలుగులోకి విద్యా ప్రమాణాలు

కరీంనగర్‌లో ప్రభుత్వ పాఠశాలల బోధనా తీరుపై ప్రభావం చూపనున్న విధానం

తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు పంపే డిజిటల్‌ మార్కుల జాబితా

కరీంనగర్‌ టౌన్‌: ఒకే తరగతి గదిలో చదువుతున్న విద్యార్థులందరి అభ్యసన సామర్థ్యాలు ఒకేలా ఉండవు. కొందరు పాఠాలను త్వరగా అర్థం చేసుకుంటే.. మరికొందరు అదే అంశాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. పరీక్షల ఫలితాల్లో కనిపించే ఈ వ్యత్యాసాలను గుర్తించడం, వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయడం అంత సులభం కాదు. ఈ పరిస్థితికి పరిష్కారంగా విద్యాశాఖ తీసుకొస్తున్న డిజిటల్‌ మూల్యాంకన విధానం ప్రభుత్వ పాఠశాలల పనితీరులో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది.

జిల్లాలో 40వేల మంది విద్యార్థులు

జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 386, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 73, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 146, మోడల్‌ స్కూళ్లు 11. కేజీబీవీలు 14 ఉండగా వీటీల్లో మొత్తంగా 40,765 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా ప్రతి ఒక్కరి విద్యాస్థాయిని విడివిడిగా పరిశీలించే వీలుంటుంది. ఏ విద్యార్థి ఏ పాఠ్యాంశంలో పట్టు సాధించారు? ఎవరికి ఇంకా ప్రాథమిక అవగాహన కూడా అవసరం? ఏ సబ్జెక్టులో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు? అనే అంశాలపై స్పష్టత వస్తుంది. దీంతో తరగతి మొత్తాన్ని ఒకే ప్రమాణంతో అంచనా వేయకుండా వ్యక్తిగత అభ్యసన స్థాయికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

ఫలితాలే కాదు.. మార్పు కనిపించాలి!

డిజిటల్‌ విధానంలో మార్కులు నమోదు చేయడం ఒక ముందడుగు మాత్రమే. ఆ వివరాల ఆధారంగా విద్యార్థుల వెనుకబాటును అధిగమించే చర్యలు తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితం లభిస్తుంది. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం వంటి ప్రాథమిక సామర్థ్యాలను సాధించేలా కార్యాచరణ ఉండాలి. ఆన్‌లైన్‌లో నమోదయ్యే గణాంకాలు తరగతి గదిలో బోధనా మార్పులకు దారితీస్తేనే ఈ ప్రయత్నానికి సార్థకత చేకూరుతుంది. చివరకు మార్కుల పట్టికలో కనిపించే అంకెలు కాకుండా.. విద్యార్థుల్లో పెరిగే జ్ఞానం, నైపుణ్యాలే ఈ విధానం విజయానికి అసలైన కొలమానం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement