కరీంనగర్‌రూరల్: వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, ప్రభుత్వ కార్యక్రమాలను రైతులకు చేరవేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన రైతునేస్తం కార్యక్రమం క్రమేపీ ఆదరణ కోల్పోతోంది. ప్రతీ మంగళవారం నిర్వహించే రైతు నేస్తంలో రైతులు పాల్గొనేందుకు ఆసక్తి చూపడంలేదు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో లక్ష్యాలను చేరుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రైతులు లేకుండానే అధికారులు మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
45 రైతువేదికల్లో రైతునేస్తం
జిల్లాలో 72 రైతువేదికలుండగా 45 రైతువేదికల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోకాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు. 2024లో మొదటిదశలో నియోజకవర్గంలోని ఒక రైతువేదికను ఎంపిక చేసి రైతునేస్తం కార్యక్రమం ప్రారంభించగా రెండో దశలో మండలానికో రైతువేదిక చొప్పున మొత్తం 15 రైతువేదికల్లో ఎంపిక చేశారు. మూడో దశలో 2025లో 30 రైతువేదికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా ప్రస్తుతం మొత్తం 45 రైతువేదికల్లో రైతునేస్తం అమలవుతోంది. శాస్త్రవేత్తలు, అధికారులు పంటల సాగు, విత్తనాలు, ఎరువుల వినియోగం, సాంకేతిక పద్ధతులు, పంట వ్యర్ధాల నిర్వహణ, ప్రభుత్వ పథకాల వివరాలను వివరిస్తున్నారు. అయితే క్షేతస్థాయిలో రైతుల నుంచి స్పందన లేకపోవడంతో నామమాత్రంగా సాగుతోంది. ప్రస్తుతం రైతులందరూ వరికోతలు చేపట్టి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే పనుల్లో నిమగ్నం కాగా అధికారులు మాత్రమే హాజరవుతున్నారు. కొన్ని రైతువేదికల్లో టెక్నికల్ సమస్యలతో వీడియో కాన్ఫరెన్స్ పనిచేయడంలేదు.
ఏఈవోలపై నిర్వహణ భారం
రైతువేదికల నిర్వహణ బాధ్యత ఏఈవోలకు భారంగా మారింది. మూడేళ్ల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈవోలే సొంతంగా ఖర్చుచేస్తున్నారు. పలు గ్రామాల్లోని రైతువేదికలు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులను ప్రతీ మంగళవారం తరలించడం కష్టంగా మారింది. రాత్రివేళల్లో భద్రత లేకపోవడంతో టీవీ, ప్రొజెక్టర్ తదితర పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లే అవకాశముందని అధికారులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతునేస్తం నిర్వహిస్తున్న వేదికలకు రక్షణగా నైట్‌వాచ్‌మెన్లను నియమించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రైతుసంఘాల ప్రతినిధులు, అధికారులు కోరుతున్నారు.


