జమ్మికుంట: మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లంచకుండా ప్రభుత్వ ఆదాయానిక గండి కోడుతున్న దుకాణాలపై తనిఖీలు చేసి విచారణ జరపాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు 30 వార్డు కౌన్సిలర్ చందారాజు తెలిపారు. కొందరు షాపు యాజమానులు తప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి కొలతలకు తగ్గట్టుగా లైసెన్స్ ఫీజు చెల్లించకుండా రూ.లక్షల పన్ను ఎగవేస్తున్నారని, దీంతో మున్సిపాలిటీకి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. వార్డు పరిధిలో దుకాణ సమూదాయాల కొలతలు తీసి నిబంధనల ప్రకారం పన్నులు, ఫెనాల్టీలు విధించాలని అన్నారు.
భూమిపూజ
చిగురుమామిడి: మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మూడు వీవో సంఘాలకు గురువారం పీఏసీఎస్ చైర్మన్ చిటుమల్ల రవీందర్, ఉప సర్పంచ్ విజయలక్ష్మిలు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. వార్డు సభ్యులు అన్నపూర్ణ, శివాంజనేయులు, అనిల్, సౌందర్య, లావణ్య, భాగ్య, సమ్మయ్య, పీఆర్‌ఏ నిరంజన్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం రజిత, పంచాయతీకార్యదర్శి రమేశ్, సీఏలు, సీసీలు, మహిళలు పాల్గొన్నారు. కాగా చిగురుమామిడిలో జలసిరి కింద చేపట్టిన బోర్‌వెల్ రీచార్జీ ఫిట్ పనులకు సర్పంచ్ భవానీ భూమిపూజ చేశారు.
దస్తావేజు లేఖరుల
సంఘం ఎన్నిక
గంగాధర: దస్తావేజు లేఖరుల సంఘం మండల అధ్యక్షుడిగా చిన్నోజ్వల మునీందర్, ఉపాధ్యక్షులుగా బొద్దుల ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా తాండ్ర రమేశ్, కోశాధికారిగా గంగాధర రాజశేఖర్, సభ్యులుగా ఇప్పలపల్లి రమణ, తాళ్ల సుధాకర్, బొంగని శ్రీముఖ ఎన్నికయ్యారు. ఎన్నికలను సీనియర్ రైటర్లు తోట చంద్రయ్య, తాళ్ల అంజయ్య, గంట కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చిగురుమామిడి: మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, నవాబుపేట్, ఇందుర్తి, ముదిమానిక్యం, సీతారాంపూర్, లంబాడిపల్లి, తో పాటు పలు గ్రామాల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ చిటుమల్ల రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఐకేపీ, సింగిల్‌విండో డైరెక్టర్లు, రైతులు హాజరు కావాలని కోరారు.
ఫెర్టిలైజర్ షాపుల
ఆకస్మిక తనిఖీ
వీణవంక: మండలంలోని ఫెర్టిలైజర్ షాపులను జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, పురుగు మందులను నిర్దేశిత ధరలకే విక్రయించాలని, నకిలీ ఎరువులు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏవో గణేష్, ఏఈవోలు శ్రావణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలి
రామడుగు: ప్రతీ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ కార్యదర్శిని కలిసి వైద్య సిబ్బంది ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని జిల్లా వైద్యాధికారి రాజగోపాల్‌రావు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి నాజియా, సిబ్బంది పాల్గొన్నారు.


