మోడల్‌ స్కూల్‌ టీచర్ల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూల్‌ టీచర్ల పోరుబాట

Oct 31 2026 12:19 AM | Updated on Oct 31 2026 12:19 AM

కరీంనగర్‌ టౌన్‌: మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఐదు ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటైన మోడల్‌ స్కూల్స్‌ యూనియన్స్‌ జేఏసీ (ఎంఎస్‌జేఏసీ) ప్రభుత్వానికి 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఉన్న 11మోడల్‌ స్కూళ్లలో మధ్యాహ్న భోజ నసమయంలో నల్లబ్యాడ్జీతో నిరసన చేపట్టారు.

నిరసన కార్యక్రమాల ప్రణాళిక

శని, ఆదివారాల్లో పాఠశాలస్థాయిలోనే నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నవంబర్‌ 2,3 తేదీల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవోలకు వినతి పత్రాలు సమర్పిస్తారు. 4,5,6 తేదీలో డీఈవో, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించనున్నారు. 10,11,12 తేదీల్లో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను కలసి సమస్యలను వివరిస్తారు. 17న చలో హైదరాబాద్‌ కార్యక్రమంతో పాఠశాల విద్యా డైరెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టేందుకు జేఏసీ స్టీరింగ్‌ కమిటీ అధ్వర్యంలో కార్యచరణ రూపొందించారు.

జిల్లాలో 11మోడల్‌ స్కూళ్లు

జిల్లావ్యాప్తంగా 11మోడల్‌ స్కూళ్లున్నాయి. ఒక్కో పాఠశాలలో ప్రిన్సిపాల్‌, పీజీటీలు –13 టీజీజీలు–6, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నలుగురు చొప్పున మొత్తంగా 24 మంది స్టాప్‌ ఉంటారు. జిల్లాలో ఆరు ప్రిన్సిపాల్‌ పోస్టులు మాత్రమే రెగ్యులర్‌కాగా, మిగితా ఐదుగురు ఇన్‌చార్జిలు కొనసాగుతున్నారు. 200మంది పిజీటీలు, 50 మంది టీజీటీలు, 44మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. హెచ్‌బీటీ 18మంది పనిచేస్తున్నారు. మిగిత పోస్టులు ఖాళీలుగా ఉన్నారు.

ప్రధాన డిమాండ్లు

మోడల్‌ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడంతోపాటు, వారికి రావాల్సిన తుది ప్రయోజనాలు చెల్లించాలి. టీజీటీ ఉపాధ్యాయులకు జూన్‌ 2013 నుంచి నోషనల్‌ సర్వీసును వర్తింపజేయాలి. పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం బకాయిలు చెల్లించడంతో పాటు, సీపీఎస్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయాలి. ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) సౌకర్యం కల్పించాలి. జీవో 317ను అమలు చేసి, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి. మోడల్‌ స్కూళ్లలో జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులను మంజూరు చేయాలి. హిందీ పీజీటీ ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు, ప్రతి పాఠశాలకు ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టును కేటాయించాలి. టీజీటీ, పీజీటీ సైన్స్‌ ఉపాధ్యాయులపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించాలి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. హెచ్‌బీటీ ఉపాధ్యాయులకు కనీస వేతనంగా నెలకు రూ.35 వేల చొప్పున చెల్లించాలి.

12 డిమాండ్లతో సర్కారుకు అల్టిమేటం

ఎంఎస్‌ జేఏసీ అధ్వర్యంలో దశలవారీగా ఆందోళనకు పిలుపు

విలీనంతోనే సమస్యలు పరిష్కారం

పాఠశాల విద్యాశాఖలో మోడల్‌ స్కూల్‌ టీచర్లను విలీనం చేయడం ద్వారా వేతనాలు, సర్వీసు తదితర సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ తరహాలో మోడల్‌ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనం చేసి, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి. జీవో 317ను అమలు చేసి ఉపాధ్యాయులు, సిబ్బందిని కొత్త మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా కేటాయించాలి. నాణ్యమైన ఫలితాలు అందిస్తున్న మోడల్‌ స్కూళ్లుపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను విడనాడాలి.

– అప్పాల అశోక్‌కుమార్‌, జేఏసీ స్టీరింగ్‌ కమిటీ నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement